
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం
జూబ్లీహిల్స్: నగర కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. నగరానికి చెందిన ప్రణీత్ పొలినేని ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్’కు ఎంపికయ్యాడు. నగరానికి చెందిన శ్రీనివాస్‌రావు, శాలిని దంపతులు అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. వారి ఏకైక కుమారుడు ప్రణీత్ ఫ్లోరిడా రాష్టంలో జాక్సన్‌విల్లేలోని స్టేషన్ కాలేజి ప్రిపేటరి స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్‌కు ధరఖాస్తు చేసుకున్నాడు. 30లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించగా చివరకు 141 మంది స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.
వీరిలో ఐదుగురు భారతీయులు కాగా అందులో ప్రణీత్ ఒకరు. 1964లో ఏర్పాటు చేసిన ఈ స్కాలర్‌షిప్ పథకంలో ఎంపిక కావడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈనెల 21న వాషింగ్టన్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో నిర్వహించే కార్యక్రమంలో అద్యక్షుడు ఒబామా చేతులమీదుగా స్కాలర్‌షిప్ అందుకోనున్నారు. అత్యుత్తమ వైద్యుడిగా సేవలు అందించడమే తన లక్ష్యమని ప్రణీత్ పేర్కొన్నాడు.