హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పండుగ శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నదీ స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులుతీరుతున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదీ తీరాల్లో కొలువుతీరిన ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివ నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి.
శ్రీశైలంలో భక్తుల రద్దీ
కార్తీక మాసం మూడో సోమవారం, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో స్నానమాచరించిన భక్తులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి బారులుతీరారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. మహిళా భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కపిలతీర్థంలో పోటెత్తిన భక్తులు
తిరుపతి: కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు పెట్టడానికి మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఆలయ ఆవరణతో పాటు పుష్కరిణి సమీపంలో మహిళలు దీపాలు పెడుతున్నారు.
రాజమండ్రి పుష్కర ఘాట్‌లో కార్తీక స్నానాలు
రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి పోటెత్తారు. పరమశివుడు అనుగ్రహం కోసం భక్తులు భక్తిశ్రద్దలతో కార్తీక స్నానాలు ఆచరించారు. కార్తీక సోమవారంతో పాటు పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. దీంతో గోదావరి ఘాట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. గజగజ వణికించే చలిలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు స్నానాలు చేశారు.