పశ్నించే గొంతుకలన్నీ ఒక్కటవ్వాలి
సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలన్నీ ఒకటై ఒకే వేదిక పైకి రావాలని ప్రజాస్వామ్య, వామపక్ష, లౌకిక, సామాజికశక్తులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. అన్ని శక్తులు ఒక్కతాటిపైకి వచ్చి ప్రజాసమస్యలపై పోరు సలపాలన్నారు. దీనికి సంబంధించి జేఏసీ చైర్మన్ కోదండరాంతోనే కాదు, అనేకమందితో తాము మాట్లాడుతున్నామన్నారు. కోదండరాం భవిష్యత్ ప్రణాళిక ఏమిటో తెలియదని, అయితే సమన్వయంతో వ్యవహరించాలనే ఆలోచనతో తామున్నామన్నారు.
బుధవారం సీపీఎం రాష్ట్రకమిటీ సమావేశాల సందర్భంగా నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, బి.వెంకట్, టి.జ్యోతిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల తరఫున పోరాడేవారంతా ఒక వేదికగా ఏర్పడి అవగాహనతో పనిచేయాలనే ఉద్దేశంతో తామున్నామని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కోదండరాం చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్ నేతలు ప్రతివిమర్శలకు పరిమితం కాకుండా కౌరవసైన్యం మాదిరిగా విరుచుకుపడటాన్ని ఖండించారు. మంత్రులు సైతం అహంకారపూరితంగా తిట్లదండకం అందుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే లేదనే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.