ఛత్తీసగడ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లాలో యువత క్రీడా ప్రతిభాన్వేషణకు త్వరలో అర్చరీ, షూటింగ్ అకాడమీలు ఏర్పాటుకానున్నాయి. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) సామాజిక బాధ్యత కార్యక్రమం(సీఎస్‌ఆర్) తోడ్పాడుతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. గిరిజన ప్రాబల్యమున్న ప్రాంతాల్లో యువతను నక్సలిజం వైపు మరలకుండా నిరోధించి వారిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ చొరవ తీసుకుందని అధికారి చెప్పారు. సెప్టెంబర్ 14న సెయిల్ చైర్మన్ పీకే సింగ్, ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ శర్మతో సీఎం రమణ్‌సింగ్ సమావేశమైనపుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అకాడమీల తొలిదశ పనులు 2018 మార్చి నాటికి మొదలయ్యే అవకాశం ఉంది. బస్తర్ లో ప్రపంచస్థాయి అథ్లెటిక్ ట్రాక్‌ను నిర్మించాలని కూడా సీఎం ఎన్‌ఎండీసీని ఆదేశించారు. సెయిల్ అధీనంలోని భిలాయి ఉక్కు ప్లాంటు దుర్గ్ జిల్లా భిలాయ్‌లో టెన్నిస్ అకాడమీ, బాస్కెట్ బాల్ అకాడమీని ఏర్పాటుచేస్తుందని కూడా సమావేశంలో నిర్ణయించారు. వీటికి అదనంగా అక్కడే భిలాయ్ సామాజిక బాధ్యతా కార్యక్రమం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్‌ను కడతారు.
నక్సలిజానికి విరుగుడు క్రీడా అకాడమీలు!
Published Fri, Sep 16 2016 8:30 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement