కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య భర్తను చంపేసింది. ఆపై కట్టుకథలల్లి తప్పించుకోజూసింది. దర్యాప్తులో పోలీసులకు దొరికిపోయింది. ఈ సంఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కధనంమేరకు పెద్దకమేళాకు చెందిన సత్యనారాయణ, సోని దంపతులకు ఇద్దరు పిల్లలు కీర్తన రాజు(11)నవ్యశ్రీ (8) ఉన్నారు. సత్యనారాయణ పెయింటర్‌గా, సోని ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉండేవారు. ఈ దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్తను సోని తలపై దాదాపు ఇరవై సార్లు కొట్టింది. తీవ్ర రక్త స్రావం కావటంతో సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోయాడు.
అనంతరం 100 నంబర్‌కు ఫోన్ చేసి, తనను బంధించి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు చంపారని కట్టుకథ చెప్పింది. ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు... ఇద్దరు పిల్లలతో కూడా అదే కథ చెప్పించింది. అయితే, మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..సోనిని అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా భర్తతో ఉన్న విభేదాల కారణంగా సుత్తితో మోది చంపినట్లు నేరాన్ని ఆమె అంగీకరించింది.