రోడ్డు పై వెళ్తున్న ఒంటరి మహిళలనే కాదు ఇంట్లో ఉన్న వారినీ వదలటం లేదు దొంగలు. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో మంగళసూత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
సైదాబాద్ పూసలబస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కె. స్వప్న స్థానికంగా పైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. కాగా, సోమవారం వేకువజామున తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని పారిపోయాడు. ఆమె తేరుకునేలోగానే గోడదూకి మాయమయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.