8 నుంచి పింఛన్ల పంపిణీ | the distribution of pensions from the 8th | Sakshi
Sakshi News home page

8 నుంచి పింఛన్ల పంపిణీ

Published Wed, Oct 29 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

8 నుంచి పింఛన్ల పంపిణీ

8 నుంచి పింఛన్ల పంపిణీ

తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే పెంచిన పింఛన్ నగదు
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో కేటీఆర్
తర్వాత నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపు

 
సాక్షి, హైదరాబాద్:  వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను సొమ్మును తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే ఇవ్వనున్నట్లు చెప్పారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల ప్రక్రియపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు.

తొలి నెల్లో నేరుగా చేతికే: వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున పింఛన్ల సొమ్మును నేరుగా వారి చేతికే అందించడం ద్వారా.. వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. ‘తర్వాతి నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపులు ఉంటాయి. గ్రామం యూనిట్‌గా పింఛన్లను పంపిణీ చేయాలి. ప్రారంభించిన మూడు రోజుల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలి’ అని చెప్పారు. పంపిణీలో సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారులకు పింఛన్ అందినట్లు కంప్యూటరైజ్డ్ రసీదు తీసుకోవాలని సూచించారు.

వారంలోగా వెరిఫికేషన్..: పింఛన్ల పంపిణీకి గడువు దగ్గర పడుతున్నందున దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, వారంలోగా పూర్తి చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల కోసం 39,90,197 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 19,27,049 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ఆహార భద్రతా కార్డుల కోసం 92,06,366 దరఖాస్తులు రాగా, 19,28,528 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. పింఛన్ల విషయమై ఇప్పటికే ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ, పెరిగిన పింఛను విషయమై మరింత విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. వితంతువుల పింఛను దరఖాస్తుల పరిశీలన సందర్భంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వారిని ఒత్తిడి  చేయవద్దని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement