గోల్కొండ: తెలంగాణ సమాజం సామూహికంగా ఆచరించే బోనాలకు గోల్కొండ కోట ముస్తాబు అయింది. కోటపై కొలువైన ఎల్లమ్మకు గురువారం ఉదయం తొలిబోనం సమర్పణతో తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. గురు, ఆదివారం జరిగే ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటతోపాటు తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారాదర్వాజ్, ఫతేదర్వాజ్, నుంచి కోటకు దారి తీసే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఐదు లక్షలమంది భక్తులు సందర్శించే గోల్కొండ బోనాల నిర్వహణకు ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్స్, విద్యుత్, సాంస్కృతిక శాఖల సహకారంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ విస్త్రతంగా ఏర్పాట్లు చేసింది.గోల్కొండ బోనాల ఎదుర్కోలు కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. ఆగస్టు 4న గోల్కొండ కోటలో చివరి బోనం సమర్పించే వరకు నగరంలో ఉత్సవాలు కొనసాగుతాయి. ఈనెల 24, 25 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సికింద్రాబాద్‌లోని పలు గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు.
ఉజ్జయిని మహంకాళి బోనాలకు 10వ తేదీన ఘటోత్సవం (ఎదుర్కోలు) నిర్వహిస్తారు. ఘటోత్సవం పురవీధుల్లో ఊరేగుతూ 24వ తేదీ తెల్లవారుజామున ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది. 17న ఘటోత్సవంతో పాతబస్తీ బోనాల వేడుక మొదలవుతుంది. లష్కర్ బోనాలు ముగిసిన వారం తర్వాత హైదరాబాద్ బోనాలు వైభవంగా జరుగుతాయి. జాతరలో ఈనెల 31న ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో, లాల్‌దర్వాజలోని శ్రీసింహవాహిని ఆలయంలో, భాగ్యలక్ష్మి ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు.