పేరుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కి అర్థాలే మారుస్తున్నారు కొందరు.. ఖాకీలు.. ఉన్నతాధికారులు ఒక పక్క సంస్కరణలు ప్రవేశపెడుతున్నా.. సిబ్బందిలో మార్పు రావడం లేదు. తాజాగా.. నార్త్ జోన్ మహంకాళీ ఏసీసీ పరిధిలోని కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించే ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ జంటను వేధించి డబ్బులు డిమాండ్ చేశారు. బుధవారం వీరిపై ఫిర్యాదు నమోదైంది.
ఘటన వివరాలు.. ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న ఇద్దరు స్నేహితులు(ఆడ, మగ) మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో కేజేఆర్ గర్డెన్ వద్ద ఆటోలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో కార్ఖాన సీఎస్ లో విధులు నిర్వహించే భరత్ బాబు(4580), రమేశ్ కుమార్(2210) బైక్ పై అక్కడకు చేరుకుని.. స్నేహితుల జంటను వేధించారు.
అంతే కాకుండా.. డబ్బులు ఇవ్వకుంటే.. కేసులు పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన వారు.. కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కార్ఖాన సీఐని వివరణ కోరగా.. సదరు కానిస్టేబుళ్లపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపానని వెల్లడించారు.