కర్ణాటక: ఓవర్‌టేక్‌కి తోడు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక యువకుడు నిండు ప్రాణం పోగొట్టుకున్న సంఘటన యలహంక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సివిల్ ఇంజినీరు కమ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న భరత్‌రెడ్డి (26) మృతుడు. బుధవారం సాయంత్రం భరత్‌రెడ్డి అట్టూరు వైపు నుంచి స్కూటర్‌పై వెళ్తూ ముందు వెళ్తున్న బీఎంటీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సును ఢీకొని కిందపడిపోయాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా భరత్‌రెడ్డి మీద నుంచి బస్సును పోనివ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తల పూర్తిగా ఛిద్రమైపోయింది. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బస్సు వదిలి పరారయ్యాడు. రోడ్డు ఇరుకుగా ఉండడం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. యలహంక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భరత్‌రెడ్డి స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా కాగా, బెంగళూరులోనే కత్రిగుప్పెలో నివాసం ఉంటున్నాడు.
డ్రైవర్‌ను శిక్షించాలని డిమాండ్
భరత్‌రెడ్డి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బీఎంటీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుని చిన్నాన్న నారాయణరెడ్డి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు యలహంకలో జరుగుతున్న ఒక నిర్మాణ పని చూడడానికి వెళ్లాడు. బస్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు అని ఆయన వాపోయారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సొంతూరికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం యలహంక పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment