ఉద్యమకారుల తిరుగుబాటు
రోడ్డుపై బైఠాయింపు టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణ
మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం
సొమ్మసిల్లిన శేర్ మణెమ్మ కంటతడి పెట్టిన కాసం
ఏఎస్‌రావునగర్: తెలంగాణ ఉద్యమకారులు తిరగబడ్డారు. ఏఎస్‌రావు నగర్ జనరల్ మహిళ స్థానానికి ఇటీవల పార్టీలో చేరిన పజ్జూరి పావనీ రెడ్డికి టీఆర్‌ఎస్ టిక్కెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి కాప్రా సర్కిల్ అధ్యక్షుడు భేతాళ బాలరాజు ఇంటి ఎదుట బైఠాయిం చారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ కమలానగర్‌లోని బాలరాజు ఇంట్లో టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు వేణుగోపాలాచారి ఉన్న విష యం తెలుసుకున్న ఆశావహులు అనుచరులతో కలసి ఇంటి ఎదుట బైఠాయించారు. రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసలు పావనీరెడ్డి ఎవరంటూ ఆందోళనకారులు ఆయనను నిలదీశారు. పార్టీ సర్కిల్ అధ్యక్షుడు బాలరాజు, డివిజన్ అధ్యక్షుడు పులి చెరాల తీరుపై విరుచుకుపడ్డారు.
ఉద్యమకారులను విస్మరించి టిక్కెట్లు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఉప్పల్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బేతి సుభాష్‌రెడ్డి అమ్ముడుపోయారని విమర్శించారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. తీవ్ర వాదోపవాదాల నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు శేర్ మణెమ్మ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కొద్దిసేపు బాలరాజు ఇంటి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. పావనీరెడ్డికి టిక్కెట్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల్లో ఎవరికి టిక్కెట్ కేటాయించినా గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వేణుగోపాలాచారి ఫోన్‌లో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు గొడవ విషయా న్ని తెలియజేశారు. శనివారం ఉదయం తన వద్దకు రావాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కొత్త రామారావు, కాసం మహిపాల్‌రెడ్డి, శేర్ మణెమ్మ, తాడురి భాగ్య, ఏనుగు సీతారాంరెడ్డి, కందాడి సుదర్శన్‌రెడ్డి, అర్చన, రాజేశ్వరి పాల్గొన్నారు.
కాసం కంట తడి
ఏఎస్‌రావునగర్ డివిజన్ జనరల్ మహిళ స్థానంలో తన సతీమణి కాసం పద్మను పోటీకి నిలపాలని ఆశించిన టీఆర్‌ఎస్ కాప్రా సర్కిల్ ప్రధాన కార్యదర్శి కాసం మహిపాల్‌రెడ్డి టికెట్‌ను పావనీరెడ్డికి కేటాయించిన విషయం తెలుసుకుని బోరున విలపించారు. గత 12 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అనేక కేసుల్లో ఇరుక్కున్న తనను అధిష్టానం గుర్తించలేదని వాపోయారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓదార్చినప్పటికీ లాభం లేకుండా పోయింది.