మేయర్ ఎన్నికపై స్పష్టత
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య, పార్టీల బలాలపై స్పష్టత వచ్చింది. అధికార టీఆర్‌ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనని తెలిసినప్పటికీ... ఏ పార్టీకి ఎంత బలం ఉందన్నది ఇంత వరకూ తేల లేదు. ఎన్నికకు హాజరు కావాల్సిందిగా ఎక్స్‌అఫీషియోలతో సహా అందరికీ అధికారులు సమాచారం పంపించడంతో దీనిపై స్పష్టత వచ్చింది. ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు వివిధ పార్టీల ఎక్స్‌అఫీషియో సభ్యులైన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్‌ఎస్ బలం 133, ఎం ఐఎం 54, కాంగ్రెస్ 10, టీడీపీకి 9, బీజేపీకి 11 కలిపితే ఆ కూటమి బలం 20. ఎక్స్‌అఫీషియోల సంఖ్య 67 కాగా... కార్పొరేటర్లు 150 మంది... కలిపి మొత్తం ఓటర్లు 217గా లెక్క తేలింది.
రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందిన వారైనప్పటికీ... ఎన్నికల నోటిఫికేషన్ నాటికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీలకు, ఏపీకి కేటాయించిన రాజ్యసభ సభ్యులకు గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించిన సంగతి తెలిసిందే. టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిని అధికార పార్టీ సభ్యులుగానే పరిగణిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ రికార్డుల మేరకు వారు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులుగానే ఉన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశ్వేశర్‌రె డ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు ఇతర కార్పొరేషన్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకుంటామని ఆప్షన్ ఇచ్చారు. దీని వల్ల వారిని జీహెచ్‌ఎంసీలో ఓటర్లుగా పరిగణించడం లేదు.
లెక్క తేలింది!
Published Tue, Feb 9 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM
Advertisement