
రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పంచాంగ శ్రవణం జరిగింది. జ్యోతిష పండితుడు సంతోష్‌కుమార్‌శాస్త్రి చేసిన పంచాంగ పఠనానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ ఏడాది చివరి నుంచి బీజేపీకి రాష్ట్రంలో, కేంద్రంలో అనుకూల పరిస్థితులు ఉంటాయని పండితులు వెల్లడించారు. రాష్ట్రాల మధ్య వైరుధ్యాలొస్తాయని, వాటిని పరిష్కరించే శక్తిసామర్థ్యాలు కేంద్రానికే ఉంటాయన్నారు.
కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ... రాజకీయాలు, పార్టీలకతీతంగా దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని, తెలంగాణలోనూ ప్రభుత్వానికి సహకరిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర సహకారం ఉంటుందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరం, కొత్త కార్యాచరణతో ముందుకు పోతామన్నారు. ఇప్పటిదాకా నిర్మాణంపై దృష్టిపెట్టామని, భవిష్యత్తులో ప్రజాసమస్యలపై కార్యాచరణ ఉంటుందన్నారు.
బీజేపీ సుదర్శన హోమం: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుదర్శన హోమాన్ని కిషన్‌రెడ్డి నిర్వహించారు. కరువు పరిస్థితులు పోవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ హోమాన్ని చేశా రు. పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, నేతలు పాల్గొన్నారు.