
పేరు వెనుక కథ..
నగర వాసులు రోజూ ఎన్నో ఏరియాలుచుట్టేస్తుంటారు. సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో ఉంటున్నా.. దానికి ఆ పేరెలా వచ్చిందో తెలియదు. తెలుసుకోవాలనిపించినా చరిత్ర తిరగేసే అవకాశం, ఓపిక ఉండదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల ‘పేరు వెనుక కథ’ తెలుసుకుందాం. - సాక్షి, సిటీబ్యూరో
ఖైరతాబాద్
రాకుమారి ‘ఖైరియాటున్నిసా’ పేరు మీదుగా ఖైరతాబాద్ వచ్చింది. ఆమె ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1518-80) కుమార్తె. ఖైరియా తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడేది. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంచితే నయమవుతుందని వైద్యులు సూచించారట. దీంతో కుతుబ్‌షా అల్లుడు, ఇంజినీర్ అయిన హజ్రత్ హుస్సేన్ షా వలిని రాకుమారి కోసం ప్యాలెస్, మసీదు, గార్డెన్, చెరువు నిర్మించమని సూచించాడు. సుల్తాన్ ఆజ్ఞ మేరకు ‘హుస్సేన్‌సాగర్’ తవ్వించాడు వలి. రాజకుమారి పేరుమీదుగా కాలక్రమంలో ‘ఖైరతాబాద్’గా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడింది.
సుల్తాన్‌బజార్
నిజాం హయాంలో ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం. 1933 వరకూ ఈ ప్రాంతం బ్రిటిష్ రెసిడెన్సీ పరిధిలో ఉండేది. జూన్ 14, 1933లో దీన్ని నిజాంకు అప్పగించారు. మొదట్లో రెసిడెన్సీ బజారని పిలిచినా.. నిజాం ఆదేశాల మేరకు సుల్తాన్ బజార్‌గా మార్చారు. అప్పట్లో ఇక్కడ ఎక్కువశాతం మరాఠీలు ఉండేవారు.
సోమాజిగూడ
‘సోనాజీ’ అనే పండిట్ పేరు నుంచి సోమాజిగూడ పేరు వచ్చింది. 1853 ప్రాంతంలో సోనాజీ.. నిజాం రెవిన్యూ విభాగంలో పనిచేసేవాడు. ఆయన నివసించిన భవంతి ఆ కాలంలో ఎంతో పేరుపొందింది. ఆయన మరణం తర్వాత ఆ ప్రాంతాన్ని సోనాజీగా పిలిచేశారు. కాలక్రమంలో సోమాజీగా మారింది.
బషీర్‌బాగ్..
పాయిగా నవాబు అస్మన్‌జా బషీరుద్దౌలా బహదూర్. ఈ ప్రాంతంలో కళ్లుచెదిరే ప్యాలెస్, పార్కును కట్టించాడు. ఈ రాజభవనం చరిత్రలో కనుమరుగైనా.. పాయిగా ప్రభువు ‘బషీరుద్దౌలా’ పేరు మాత్రం ‘బషీర్‌బాగ్’గా నిలిచిపోయింది.
తార్నాక..
నిజాంల హయాంలో ఈ ప్రాంతం మామిడి తోటలతో ఉండేది. వీటి రక్షణకు ముళ్లకంచె వేసి కాపలా కోసం, పహారా కాసేందుకు నిజాంలు కొందరిని నియమించారు. భద్రతా సిబ్బంది కోసం అవుట్‌హౌస్ సైతం కట్టించారు. ఉర్దూలో ‘తార్’ అంటే ‘వైరు’ అని, ‘నాకా’ అంటే ‘రక్షకభటుడి గది’ అని అర్థం. అలా తార్నాక పేరు స్థిరపడింది.