లాటరీ తగిలిందని దోచేస్తారు...!
బల్క్ ఎస్సెమ్మెస్‌లతో నైజీరియన్ల వల
ఆదాయ పన్ను కట్టాలని డబ్బు వసూలు మోసపోయిన పలువురు
పెళ్లి పేరుతోనూ యువతులకు గాలం
నిందితులను ట్రాన్సిట్ రిమాండ్‌పై సిటీకి తీసుకొచ్చిన పోలీసులు
సిటీబ్యూరో: ఎయిర్‌టెల్..చెవ్రోలెట్ కార్ ప్రోమో...ఆపిల్ ఐ ఫోన్ డ్రా...ఇలా వివిధ లాటరీలు తగిలాయంటూ ఎస్‌ఎంఎస్‌లు రాగానే ఎగిరి గంతేయకండి. ఈ నగదు బహుమతిని సొంతం చేసుకోవాలంటే మీ పూర్తి వివరాలు ఈ మెయిల్ చేయండనే సందేశం రాగానే.. చకచకా కీబోర్డుపై టపటపా వివరాలు కొట్టేయకండి. అలా చేస్తే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. లక్షలు పోగొట్టుకోవాల్సి వస్తుంది.
ఇలా సీన్ మొదలవుతుంది...
అపరిచితులు పంపిన ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లు ఊరిస్తుంటాయి. కొందరు లైట్‌గా తీసుకుంటే...మరికొందరు సీరియస్‌గా తీసుకొని ముందుకెళ్తున్నారు. మనిషికి ఉన్న డబ్బు ఆశను క్యాష్ చేసుకోవడానికి నైజీరియన్లు గేలం వేస్తున్నారు. ఇదే దేశానికి చెందిన బాబ్(అలియాస్ జేమ్స్) మీకు లాటరీ తగిలిందని బల్క్ ఎస్‌ఎంస్‌లు పంపించి పూర్తి వివరాలను తనకు మెయిల్ చేయమని ఓ మెయిల్ ఐడీ పంపిస్తాడు. అతడి ఎస్‌ఎంఎస్‌కు స్పందించి కొంతమంది అమాయకులు తమ వివరాలు పంపుతారు. తర్వాత గెలుచుకున్న నగదును పంపాలంటే ఆదాయ పన్ను కట్టాలని చెప్తాడు. ఢిల్లీలో వివిధ బ్యాంక్‌ల్లో తన ఏజెంట్లు తెరిచిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పంపి డబ్బు డిపాజిట్ చేయమని కోరతాడు. నగదు బహుమతి కోసం ఆశపడిన అమాయకులు డబ్బు డిపాజిట్ చేయగానే ఆ డబ్బును ఏజెంట్‌లు విత్‌డ్రా చేస్తారు. అదే రోజూ సాయంత్రం బాబ్‌ను గుర్గావ్‌కు సమీపంలోని మాల్స్‌లో కలిసి ఆ డబ్బును అందచేస్తారు. ఇందులో నుంచి ఒక్కో ఏజెంట్‌కు మూడు నుంచి 10 శాతం వరకు కమిషన్ చెల్లిస్తాడు. అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ బ్యాంక్ ఖాతాలను కేవలం మూడు నెలలు మాత్రమే వినియోగంలో ఉంచి ఆ తర్వాత రద్దు చేస్తారు.
ఆరుగురి కస్టమర్లకు ఒక ఫోన్...ఒక పేరు...
బాబ్ (జేమ్స్) 50 నుంచి 60 ఫోన్‌లు వాడుతున్నాడు. ఆ నంబర్లతోనే కస్టమర్లకు ఫోన్ చేస్తాడు. ఒక్కో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఒక్కో పేరుతో మాట్లాడేవాడు. ఆరుగురు కస్టమర్లకు ఒక్కో ఫోన్ వినియోగించేవాడు. ప్రజలను మోసగించడం, లూటీ చేయడం అయ్యాక ఆ ఫోన్, సిమ్‌కార్డులను ధ్వంసం చేస్తాడు.
యూకే, పాకిస్తాన్ల నుంచి తెప్పించిన సిమ్స్ కార్‌డ్సతో...
ఒక్కో ఫోన్‌కు ఒక్కో పేరుతో చీటీ రాసి పెట్టుకునేవాడు. సదరు సెల్‌కు కాల్ రాగానే ఆ ఫోన్‌పై ఉన్న చీటీలో పేరు చూసి అదే పేరుతో మాట్లాడేవాడు. యూకే నుంచి తెప్పించుకున్న సిమ్ కార్డులు ఉపయోగిస్తూ బ్రిటన్ దేశస్తుడిగా పరిచయం చేసుకునేవాడు. ఇదే తరహాలో పాకిస్తాన్‌కు చెందిన సిమ్‌కార్డులు కూడా వాడేవాడు. అయితే ఇదంతా ఢిల్లీ కేంద్రంగానే నడిపేవాడు.
ముగ్గురిని ముగ్గులోకి దింపాడు...
పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సంపన్న యువతులకు గాలం వేసేందుకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ఒక్కోదానిలో ఒక్కో ప్రొఫైల్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు బాబ్. ఆ తర్వాత ధనవంతుల అమ్మాయిలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులను కాంటాక్ట్ అయి పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చేవాడు. మంచి హోదాలో ఉన్నానని, ధనవంతుడనని వారిని నమ్మించేవాడు. ఆ తర్వాతే బాబ్ సహాయకురాలు లెనియా సీన్‌లోకి వస్తుంది. కొన్నిసార్లు కస్టమ్ అధికారిణిగా, మరికొన్ని సార్లు ఐఎంఎఫ్ ఉద్యోగిణిగా పరిచ యం చేసుకుంటుంది. మీకు రావాల్సిన నగదు పార్సల్ అందాలంటే పన్ను చెల్లించాలని చెప్పి.. బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చి డబ్బు డిపాజిట్ చేయించుకుంటుంది. ఇలా వీరి వలలో చిక్కి హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు రూ. 48 లక్షలు చెల్లించింది. మరో అమ్మాయి రూ. 7 లక్షల వరకు మోసపోయింది. మరో అమ్మాయి ఫేస్‌బుక్‌తో బాబ్ వలలో పడి రూ.20 లక్షలు సమర్పించుకుంది.
ఎట్టకేలకు దొరికారు...
వీరి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరిపారు. పక్కా వ్యూహంతో బాబ్, జోసెఫ్‌తో సహా నాగ్‌లాండ్‌కు చెందిన లెనియాను అరెస్టు చేశారు. వీరిని ట్రాన్సిట్ రిమాండ్‌పై నగర పోలీసులు గురువారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
జాగ్రత్త అవసరం..
ప్లస్ 371, ప్లస్ 371 నంబర్లతో వచ్చే ఫోన్ల విషయంలో జాగ్రత్త వహించండి. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారం పెట్టకపోవడమే ఉత్తమం. బూటకపు ఈమెయిల్స్‌తో నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని నకిలీ సంస్థలు. నగదు లావాదేవీల్లో నయా వంచన జరుగుతోంది. అమ్మాయిలు కూడా ఊరికే ఎదుట వ్యక్తులను నమ్మి లక్షలు లక్షలు ధారపోయడం కరెక్ట్ కాదు. సైబర్ నేరగాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
- స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్, క్రైమ్స