Lotteries
-
రూ.100 గెలిస్తే ఇచ్చేది మాత్రం రూ.68!
నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఫలానా వ్యక్తి లాటరీ గెలుచుకున్నారని వింటూంటాం. ఒకవేళ ఆ వ్యక్తి రూ.100 లాటరీ ద్వారా గెలుపొందితే ట్యాక్స్‌లు పోను తనకు చివరకు అందేది దాదాపు రూ.68 మాత్రమే. మిగతా రూ.32లు వివిధ ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అసలు లాటరీ పొందిన వారికి ఎలాంటి ట్యాక్స్‌లు విధిస్తున్నారు. అది ఎంత మొత్తంలో కట్టాల్సి ఉంటుందో తెలుసుకుందాం.కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే స్కూటర్ మెకానిక్ ఇటీవల ఏకంగా రూ.25 కోట్ల లాటరీ గెలుపొందారు. కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో పాల్గొనేందుకు రూ.500 పెట్టి టికెట్ కొన్నారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అందులో అల్తాఫ్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ట్యాక్స్‌లో పోను చివరకు తనకు అందేది మాత్రం సుమారు రూ.17.25 కోట్లు కావడం గమనార్హం. అంటే రూ.7.8 కోట్లమేర ట్యాక్స్ కట్ అవుతుంది.ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటాట్యాక్స్లు ఇలా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194బీ కింద లాటరీలో గెలుపొందిన డబ్బుపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఈ 30 శాతం పన్నుపై అదనంగా మరో నాలుగు శాతం వరకు సర్‌ఛార్జీ, సెస్ రూపంలో ట్యాక్స్ కట్టాలి. దాంతో మొత్తం సమకూరిన సొమ్ముపై 31.2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్‌ఛార్జీ, సెస్‌ను ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, విద్యకు వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే సదరు లాటరీ సంస్థలు టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత) రూపంలో పన్ను కట్ చేసుకుని మిగతా డబ్బు విజేతలకు ఇస్తారు. లాటరీ ద్వారా గెలుపొందిన డబ్బు రెగ్యులర్ ఇన్కమ్ కిందకు రాదు. అది ‘ఇతర ఆదాయం’ విభాగంలోకి వస్తుంది. కాబట్టి బీమాకు సంబంధించిన 80డీ కింద ప్రభుత్వం గరిష్టంగా ఇచ్చే రూ.50 వేలు, 80సీ కింద ఇచ్చే రూ.1.5 లక్షలు పన్ను వెసులుబాటుకు అనర్హులుగా పరిగణిస్తారు. -
పెళ్లిరోజు గిఫ్ట్‌తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య
పెళ్లిరోజున భర్త ఇచ్చిన డబ్బుతో భార్య ఏకంగా రూ.8.2 కోట్లు సంపాదించిన ఆసక్తికర సంఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన పాయల్ అనే మహిళ తన భర్త హర్నెక్ సింగ్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వారి 16వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్త పాయల్‌కు బహుమతిగా 1000 ధిరమ్‌లు(రూ.22వేలు) ఇచ్చారు.ఆ డబ్బుతో పాయల్ 3337 అనే రాఫిల్ టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా ఆ లాటరీ టికెట్‌పై జాక్‌పాట్ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డీడీఎఫ్) మిలీనియం మిలియనీర్ సిరీస్ 461లో పాయల్ 1 మిలియన్ డాలర్ల(రూ.8.2 కోట్లు)ను గెలుచుకున్నారు.ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ..‘నేను ఈ సిరీస్‌లో విజేతగా మారడానికి నా భర్త ఇచ్చిన డబ్బే కారణం. ఏప్రిల్ 20న మా 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నాకు 1,000 ధిరమ్‌లు గిఫ్ట్ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆన్లైన్లో డీడీఎఫ్ టిక్కెట్ కొనాలని అనుకున్నాను. 3 అనే అంకె ఎక్కువసార్లు వచ్చే లాటరీ నంబర్‌ను ఎంచుకున్నాను. దాంతో 3337ను సెలక్ట్ చేసుకున్నాను. ఈ లాటరీ పొందడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ వార్తను నాభర్తతో ఫోన్లో చెప్పినపుడు తనకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నాకు 14 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కవల పిల్లలు. ఇంకా వారికి వార్త తెలియదు. ఇంటికి వెళ్లాక చెప్తాను. నా పిల్లల భవిష్యత్తు నాకుముఖ్యం. ఈ డబ్బుతో వారికి మంది విద్యను అందిస్తాను’ అని ఓ మీడియా సంస్థతో చెప్పారు.గత పన్నెండేళ్లుగా పాయల్ డీడీఎఫ్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారని మీడియా సంస్థ తెలిపింది. ప్రతిసారి ప్రయాణాల నిమిత్తం ఎయిర్పోర్ట్ వెళ్తున్నపుడు డీడీఎఫ్ టికెట్లు కొనుగోలు చేయడం అలవాటని పాయల్ చెప్పారు. కానీ ఈసారి మొదటగా ఆన్లైన్లో ఖరీదు చేశానన్నారు. -
దేశంలోనే అత్యధిక ఎన్నికల బాండ్ల కొనుగోలు.. చుట్టూ వివాదాలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఈ డేటా వచ్చిన వెంటనే ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు మారుమోగింది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికలబాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారీగా ఎన్నికలబాండ్లు కొనుగోలు చేసిన ఆ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మయన్మార్‌లో సాదాసీదా కూలీగా జీవనం సాగించిన మార్టిన్ రూ.కోట్ల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగాడో ఈ కథనంలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే లాటరీ వ్యాపారం భారత్‌లోనే పుట్టిన మార్టిన్ చిన్నతనంలో మయన్మార్‌లో చాలాకాలం పాటు కూలీగా జీవనం సాగించారు. తన 13వ ఏటా తిరిగి భారత్‌కు వచ్చి తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు దేశం అంతటా విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్‌లో కూడా తన బిజినెస్‌ను మొదలుపెట్టారు. తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్టైల్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాటరీలు చట్టబద్ధమని తెలుసుకున్న మార్టిన్ ఆయా రాష్ట్రాల్లో సుమారు 1,000 మందిని నియమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు. నాగాలాండ్, సిక్కింలో అయితే తన కంపెనీకి చెందిన 'డియర్ లాటరీ' సంస్థదే ఆధిపత్యం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం కూడా ఉంది. వివాదాలతో వెలుగులోకి.. సిక్కిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008లో రూ.4,500 కోట్లకు పైగా మోసానికి పాల్పడడంతో మార్టిన్ పేరు బయటకొచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మార్టిన్ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2011లో అక్రమ లాటరీ వ్యాపారాలపై అణిచివేతలో భాగంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా తన కంపెనీలో సోదాలు నిర్వహించారు. 2013లో, కేరళ పోలీసులు రాష్ట్రంలో అక్రమ లాటరీ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా మార్టిన్ సంస్థలో దాడులు చేశారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలు మార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. -
మార్చి 1 నుంచి లాటరీలపై 28 శాతం జిఎస్టీ
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మార్చి 1 నుంచి లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. రాష్ట్రాలు నిర్వహిస్తున్న లేదా ఆధీకృత లాటారీలపై 28 శాతం శ్లాబ్‌లో ఏకరీతి పన్నును విధించాలని గత ఏడాది డిసెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీపై 12 శాతం పన్ను ఉండగా, రాష్ట్ర అధీకృత లాటరీపై 28 శాతం పన్ను విధిస్తున్నారు. లాటరీలపై ఏకరీతి పన్ను ఉండాలనే డిమాండ్ల నేపథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం సిఫార్సుతో లాటరీలపై 28 శాతం యూనిఫాం రేటుతో పన్ను విధించాలని గత ఏడాది డిసెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా మార్చి 1 నుంచి లాటరీలపై నూతన పన్ను విధానం అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చదవండి : ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా -
లాటరీ తగిలిందని దోచేస్తారు...!
బల్క్ ఎస్సెమ్మెస్‌లతో నైజీరియన్ల వల ఆదాయ పన్ను కట్టాలని డబ్బు వసూలు మోసపోయిన పలువురు పెళ్లి పేరుతోనూ యువతులకు గాలం నిందితులను ట్రాన్సిట్ రిమాండ్‌పై సిటీకి తీసుకొచ్చిన పోలీసులు సిటీబ్యూరో: ఎయిర్టెల్..చెవ్రోలెట్ కార్ ప్రోమో...ఆపిల్ ఐ ఫోన్ డ్రా...ఇలా వివిధ లాటరీలు తగిలాయంటూ ఎస్ఎంఎస్లు రాగానే ఎగిరి గంతేయకండి. ఈ నగదు బహుమతిని సొంతం చేసుకోవాలంటే మీ పూర్తి వివరాలు ఈ మెయిల్ చేయండనే సందేశం రాగానే.. చకచకా కీబోర్డుపై టపటపా వివరాలు కొట్టేయకండి. అలా చేస్తే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. లక్షలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలా సీన్ మొదలవుతుంది... అపరిచితులు పంపిన ఇలాంటి ఎస్ఎంఎస్లు ఊరిస్తుంటాయి. కొందరు లైట్‌గా తీసుకుంటే...మరికొందరు సీరియస్‌గా తీసుకొని ముందుకెళ్తున్నారు. మనిషికి ఉన్న డబ్బు ఆశను క్యాష్ చేసుకోవడానికి నైజీరియన్లు గేలం వేస్తున్నారు. ఇదే దేశానికి చెందిన బాబ్(అలియాస్ జేమ్స్) మీకు లాటరీ తగిలిందని బల్క్ ఎస్ఎంస్లు పంపించి పూర్తి వివరాలను తనకు మెయిల్ చేయమని ఓ మెయిల్ ఐడీ పంపిస్తాడు. అతడి ఎస్ఎంఎస్కు స్పందించి కొంతమంది అమాయకులు తమ వివరాలు పంపుతారు. తర్వాత గెలుచుకున్న నగదును పంపాలంటే ఆదాయ పన్ను కట్టాలని చెప్తాడు. ఢిల్లీలో వివిధ బ్యాంక్‌ల్లో తన ఏజెంట్లు తెరిచిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పంపి డబ్బు డిపాజిట్ చేయమని కోరతాడు. నగదు బహుమతి కోసం ఆశపడిన అమాయకులు డబ్బు డిపాజిట్ చేయగానే ఆ డబ్బును ఏజెంట్లు విత్‌డ్రా చేస్తారు. అదే రోజూ సాయంత్రం బాబ్ను గుర్గావ్కు సమీపంలోని మాల్స్‌లో కలిసి ఆ డబ్బును అందచేస్తారు. ఇందులో నుంచి ఒక్కో ఏజెంట్‌కు మూడు నుంచి 10 శాతం వరకు కమిషన్ చెల్లిస్తాడు. అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ బ్యాంక్ ఖాతాలను కేవలం మూడు నెలలు మాత్రమే వినియోగంలో ఉంచి ఆ తర్వాత రద్దు చేస్తారు. ఆరుగురి కస్టమర్లకు ఒక ఫోన్...ఒక పేరు... బాబ్ (జేమ్స్) 50 నుంచి 60 ఫోన్లు వాడుతున్నాడు. ఆ నంబర్లతోనే కస్టమర్లకు ఫోన్ చేస్తాడు. ఒక్కో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక్కో పేరుతో మాట్లాడేవాడు. ఆరుగురు కస్టమర్లకు ఒక్కో ఫోన్ వినియోగించేవాడు. ప్రజలను మోసగించడం, లూటీ చేయడం అయ్యాక ఆ ఫోన్, సిమ్‌కార్డులను ధ్వంసం చేస్తాడు. యూకే, పాకిస్తాన్ల నుంచి తెప్పించిన సిమ్స్ కార్డ్సతో... ఒక్కో ఫోన్‌కు ఒక్కో పేరుతో చీటీ రాసి పెట్టుకునేవాడు. సదరు సెల్‌కు కాల్ రాగానే ఆ ఫోన్‌పై ఉన్న చీటీలో పేరు చూసి అదే పేరుతో మాట్లాడేవాడు. యూకే నుంచి తెప్పించుకున్న సిమ్ కార్డులు ఉపయోగిస్తూ బ్రిటన్ దేశస్తుడిగా పరిచయం చేసుకునేవాడు. ఇదే తరహాలో పాకిస్తాన్‌కు చెందిన సిమ్‌కార్డులు కూడా వాడేవాడు. అయితే ఇదంతా ఢిల్లీ కేంద్రంగానే నడిపేవాడు. ముగ్గురిని ముగ్గులోకి దింపాడు... పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సంపన్న యువతులకు గాలం వేసేందుకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఒక్కోదానిలో ఒక్కో ప్రొఫైల్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు బాబ్. ఆ తర్వాత ధనవంతుల అమ్మాయిలు, సాఫ్ట్వేర్ ఉద్యోగినులను కాంటాక్ట్ అయి పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చేవాడు. మంచి హోదాలో ఉన్నానని, ధనవంతుడనని వారిని నమ్మించేవాడు. ఆ తర్వాతే బాబ్ సహాయకురాలు లెనియా సీన్లోకి వస్తుంది. కొన్నిసార్లు కస్టమ్ అధికారిణిగా, మరికొన్ని సార్లు ఐఎంఎఫ్ ఉద్యోగిణిగా పరిచ యం చేసుకుంటుంది. మీకు రావాల్సిన నగదు పార్సల్ అందాలంటే పన్ను చెల్లించాలని చెప్పి.. బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చి డబ్బు డిపాజిట్ చేయించుకుంటుంది. ఇలా వీరి వలలో చిక్కి హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు రూ. 48 లక్షలు చెల్లించింది. మరో అమ్మాయి రూ. 7 లక్షల వరకు మోసపోయింది. మరో అమ్మాయి ఫేస్‌బుక్‌తో బాబ్ వలలో పడి రూ.20 లక్షలు సమర్పించుకుంది. ఎట్టకేలకు దొరికారు... వీరి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరిపారు. పక్కా వ్యూహంతో బాబ్, జోసెఫ్‌తో సహా నాగ్లాండ్కు చెందిన లెనియాను అరెస్టు చేశారు. వీరిని ట్రాన్సిట్ రిమాండ్‌పై నగర పోలీసులు గురువారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. జాగ్రత్త అవసరం.. ప్లస్ 371, ప్లస్ 371 నంబర్లతో వచ్చే ఫోన్ల విషయంలో జాగ్రత్త వహించండి. ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారం పెట్టకపోవడమే ఉత్తమం. బూటకపు ఈమెయిల్స్‌తో నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని నకిలీ సంస్థలు. నగదు లావాదేవీల్లో నయా వంచన జరుగుతోంది. అమ్మాయిలు కూడా ఊరికే ఎదుట వ్యక్తులను నమ్మి లక్షలు లక్షలు ధారపోయడం కరెక్ట్ కాదు. సైబర్ నేరగాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. - స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్, క్రైమ్స