ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌లోడ్ చేసింది. అయితే ఈ డేటా వచ్చిన వెంటనే ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు మారుమోగింది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికలబాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది.
భారీగా ఎన్నికలబాండ్లు కొనుగోలు చేసిన ఆ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మయన్మార్‌లో సాదాసీదా కూలీగా జీవనం సాగించిన మార్టిన్ రూ.కోట్ల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
చిన్నప్పటి నుంచే లాటరీ వ్యాపారం
భారత్‌లోనే పుట్టిన మార్టిన్ చిన్నతనంలో మయన్మార్‌లో చాలాకాలం పాటు కూలీగా జీవనం సాగించారు. తన 13వ ఏటా తిరిగి భారత్‌కు వచ్చి తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు దేశం అంతటా విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్‌లో కూడా తన బిజినెస్‌ను మొదలుపెట్టారు. తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్‌టైల్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు.
అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాటరీలు చట్టబద్ధమని తెలుసుకున్న మార్టిన్ ఆయా రాష్ట్రాల్లో సుమారు 1,000 మందిని నియమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు. నాగాలాండ్, సిక్కింలో అయితే తన కంపెనీకి చెందిన 'డియర్ లాటరీ' సంస్థదే ఆధిపత్యం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం కూడా ఉంది.
వివాదాలతో వెలుగులోకి..
సిక్కిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008లో రూ.4,500 కోట్లకు పైగా మోసానికి పాల్పడడంతో మార్టిన్ పేరు బయటకొచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మార్టిన్ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2011లో అక్రమ లాటరీ వ్యాపారాలపై అణిచివేతలో భాగంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా తన కంపెనీలో సోదాలు నిర్వహించారు. 2013లో, కేరళ పోలీసులు రాష్ట్రంలో అక్రమ లాటరీ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా మార్టిన్ సంస్థలో దాడులు చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్..
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలు మార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి.
ఏంటీ ఎన్నికల బాండ్లు..?
ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment