రూ.25 లక్షల విలువైన మొబైళ్లు చోరి | Theives rob mobile shop in the city, costs Rs.25 lakh | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షల విలువైన మొబైళ్లు చోరి

Published Tue, Jun 7 2016 8:17 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Theives rob mobile shop in the city, costs Rs.25 lakh

హైదరాబాద్: తాళం పగులకొట్టలేదు.. షట్టర్ ధ్వంసం చేయలేదు.. ఏడుగురు వచ్చారు, ఇద్దరు లోపలికి వెళ్లారు.. 20 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని రూ.25 లక్షలు సొత్తు ఎత్తుకుపోయారు. ఇదీ సోమవారం అర్ధరాత్రి మహంకాళి పోలీసుస్టేషన్ పరిధిలోని ‘అపెక్స్’ యాపిక్ మొబైల్ ఔట్‌లెట్‌లో జరిగిన భారీ చోరీ నేపథ్యం.  దుకాణం బయట, లోపల ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను నగర పోలీసులు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. షాపు నిర్వాహకుల నిర్లక్ష్యం దుండగులకు కలిసొచ్చిందని భావిస్తున్నారు. నిందితుల కోసం  ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.


‘అపెక్స్’ దుకాణం బయట ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దశ్యాల్లో మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా చోరీకి పాల్పడినట్ట తెలుస్తోంది. వీరిలో నలుగురి వీపుకు బ్యాగ్‌లు తగిలించుకుని ఉన్నారు. తెల్లవారుజామున 3.39 గంటల ప్రాంతంలో దుకాణం దగ్గరకు వచ్చిన గ్యాంగ్..  వెంట తెచ్చుకున్న బ్యాగుల్లోంచి రెండు దుప్పట్లు బయటకు తీశారు. షట్టర్‌కు కుడివైపుగా ఇద్దరు వాటిని తెరిచి అడ్డంగా పట్టుకున్నారు. ఎవరైనా వాళ్లను చూసినా..  దుప్పట్లు పర్చుకొని పడుకుంటున్నారని భావించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దుకాణానికి సెంటర్ లాక్ వ్యవస్థ అందుబాటులో ఉన్నా నిర్వాహకులు దాన్ని ఉపయోగించకపోవడం దుండగులకు కలిసొచ్చింది. షట్టర్ ను చిన్న రాడ్ తో ఎత్తిపట్టుకుని ఏర్పడిన సందులో నుంచి ఇద్దరు వ్యక్తులు లోపలికి  ప్రవేశించారు. మిగిలిన వారు దుప్పటిని మడతపెట్టుకుని కాస్త దూరంగా వెళ్లారు. షట్టర్ వెనుక దుకాణం లోపలి వైపు అలంకరణ కోసం గ్లాస్ ఫిటింగ్, డోర్ ఉన్నప్పటికీ దానికి కూడా ఎలాంటి లాక్ లేకపోవడంతో దుండగుల పని తేలికైంది. దుకాణంలోకి వెళ్లిన ఇద్దరు దుండగులు 16 నిమిషాల్లో పని పూర్తి కానిచ్చేశారు.

ఫోన్లు మాత్రమే..
‘అపెక్స్’ దుకాణంలో యాపిల్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్స్ తదితరాలు ఉన్నాయి. అయితే, దొంగలు కేవలం సెల్‌ఫోన్లు ఉన్న షెల్ఫ్‌ను చిన్నపాటి రాడ్డుతో పగులకొట్టారు. ఒకడు అందులోని సెల్‌ఫోన్లను బయటకు తీసి ఇస్తుండగా.. మరొకడు బాక్సులు ఓపెన్ చేసి పక్కన పడేస్తూ కేవలం వాటిలో ఉన్న ఫోన్లు మరో పక్కన పేర్చాడు. ఇలా తమకు కావాల్సిన ఫోన్లు వేరు చేసిన తర్వాత క్యాష్ కౌంటర్‌ను పగులకొట్టి అందులో ఉన్న రూ.51 వేల నగదు తీసుకున్నారు. ఆపై రూ.24.85 లక్షల విలువైన ఫోన్లను వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో సర్దుకుని పారిపోయారు. ఈ మొత్తం చోరీ 20 నిమిషాల్లో పూర్తయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది.

అంతర్రాష్ట్ర ముఠా ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యాపిల్ ఫోన్లకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబర్లు క్లోనింగ్ చేయడం సాధ్యం కాదు. అలా కాకుండా వాటిని దేశంలో ఎక్కడ విక్రయించినా పోలీసులు సాంకేతికంగా ట్రాకింగ్ చేసి గుర్తిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాదికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా పక్కా రెక్కీ తర్వాత ఈ చోరీ చేసిందని, సొత్తును వివిధ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించే ఆస్కారం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండుగులు వచ్చిపోయిన మార్గాలను గుర్తించడం కోసం సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని మినర్వా కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ‘అపెక్స్’ నుంచి అన్ని వైపులకు ఉన్న రహదారుల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను అధ్యయనం చేస్తున్నారు. వీరు రైలులో వచ్చి వెళ్లి ఉంటారనే అనుమానంతో రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను కూడా పరిశీలించాలని నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement