- స్లైడింగ్ డోర్ ఉన్న లాడ్జిలు, ఇళ్లే టార్గెట్
- ఏడాది కాలంలో 14 చోట్ల దొంగతనాలు
- అంతరాష్ట్ర దొంగ సహా ఇద్దరు అరెస్టు
- నిందితుల్లో ఒకడు బీటెక్ గ్రాడ్యుయేట్
హైదరాబాద్: తెల్లవారుజామున రెండు గంటలకు డెన్ నుంచి బయలుదేరడం... ఫోర్డ్ ఐకాన్ కారులో సంచరిస్తూ రెక్కీలు నిర్వహించి స్లైడింగ్ డోర్స్ ఉన్న లాడ్జిలు, హోటళ్లు, ఇళ్లు గుర్తించి అదును చూసి లోపలకు ప్రవేశించి అందినకాడికి దోచుకోవడం.. ఈ పంథాలో రెచ్చిపోతున్న ఇద్దరు దొంగల్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక అంతరాష్ట్ర దొంగతో కూడిన ఈ ద్వయం ఏడాదిలో 14 చోట్ల చోరీలకు పాల్పడినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మంగళవారం తెలిపారు. వీరి నుంచి 1.45 కేజీల బంగారం, ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముంబైలో నేరబాట.. ఛత్తీస్‌ఘర్ లోని బస్తర్ జిల్లా జగ్‌దల్‌పూర్‌కు చెందిన ఆర్య ప్రతాప్ నాగ్ అలియాస్ దీపక్ మెట్రిక్యులేషన్‌తో చదువుకు స్వస్థి చెప్పాడు. సినిమాల్లో నటించాలన్న ఆశతో ముంబై చేరుకున్నాడు. కొంతకాలం డ్యాన్సులు, నటన నేర్చుకున్నా.. అవకాశాలు రాకపోవడంతో ఫాల్ సీలింగ్ నిర్మాణాన్ని జీవనాధారంగా చేసుకున్నాడు. 2013లో ఓ భవనంలో పని చేస్తున్న ఇతను ఎదురుగా ఉన్న శాటిలైట్ హోటల్‌లో ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో విల్లేపార్లే పోలీసులకు చిక్కి జైలు నుంచి వచ్చిన తర్వాత 2014లో అక్కడి సహార్ అంధేరీ (ఈస్ట్) ఠాణా పరిధిలో మరో లాడ్జిలోకి ప్రవేశించి ఖరీదైన సెల్‌ఫోన్ చోరీ చేశాడు.
రైల్లో పరిచయంతో..
2015లో బెయిల్ పొందిన ఇతను ఆ ఏడాది జూన్‌లో రైల్లో హైదరాబాద్‌కు వస్తుండగా ఎర్రగడ్డ భవానీనగర్‌కు చెందిన మహ్మద్ ముస్తాఫాతో పరిచయం ఏర్పడింది. బీటెక్ పూర్తి చేసిన ఇతడు సరైన ఉద్యోగం లేకపోవడంతో ఇంటీరియర్ డెకరేటర్ గా పని చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్న ఇతడికి ఆర్య మాటలు నచ్చడంతో జట్టు కట్టి తన ఇంటికే తీసుకువచ్చి షెల్టర్ ఇచ్చాడు. సాధారణంగా తిరుగుతూ చోరీలు చేస్తే పోలీసులకు చిక్కుతామనే ఉద్దేశంతో ఎర్రగడ్డలో ఓ సెకండ్ హ్యాండ్ ఫోర్డ్ ఐకాన్ కారును ఖరీదు చేసి అందులో తిరుగుతూ రెక్కీలు నిర్వహించి చోరీలకు పాల్పడేవారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరి కిటికీలకు గ్రిల్స్ లేని, స్లైడింగ్ డోర్‌తో కూడిన గదుల్ని గుర్తిస్తారు. ముస్తఫా కారులోనే ఉండి పరిసరాలను గమనిస్తుండగా... ఆర్య డ్రైనేజ్ పైపు ద్వారా పైకి ఎక్కి స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలకు వెళ్లి ఏమాత్రం అలికిడి కాకుండా బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులను కొట్టేసి కారులో ఉడాయిస్తారు. వీరిద్దరూ ఏడాది కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, సైఫాబాద్, బేగంపేట, మార్కెట్, గోపాలపురం, సుల్తాన్‌బజార్, మియాపూర్ ఠాణాల పరిధిలోని ఏడు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఏడాదిలో ఒకే తరహాలో 14 చోరీలు చేసిన ఈ నిందితులకు సంబంధించి ఆధారాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులకు బేగంపేటలోని ట్రీబూ ట్రాన్సిట్ హోటల్‌లో దొరికింది. ఈ ఏడాది అక్కడ చోరీ చేసిన ఆర్య సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాడు. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని ముస్తఫా, ఆర్యలను అరెస్టు చేశారు. ఈ నిందితులపై పీడీ యాక్ట్‌కు సిఫార్సు చేస్తామని, తదుపరి దర్యాప్తులో దొరికిన ఆధారాలను బట్టి రిసీవర్‌పై చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.
కారు వాడుతూ.. చోరీలు..
Published Tue, Jun 21 2016 10:22 PM | Last Updated on Thu, Oct 4 2018 4:56 PM
Advertisement
Advertisement