కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందే | they have to implement interim orders of the court, says senior lawyer ravi shankar | Sakshi
Sakshi News home page

కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందే

Published Fri, Mar 18 2016 11:20 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందే - Sakshi

కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందే

ఎమ్మెల్యే రోజా మీద ఏపీ అసెంబ్లీ విధించిన ఏడాది సస్పెన్షన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శాసనసభ అమలుచేసి తీరాల్సిందేనని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చెప్పారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన శుక్రవారం 'సాక్షి'తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''వీళ్లొక్కళ్లకే న్యాయం తెలుసని అనుకోవాలా.. న్యాయమూర్తి వివరంగా ఆర్డర్ రాసినప్పుడు శాసనసభే గొప్పది, అందులో జోక్యానికి న్యాయస్థానానికి హక్కు లేదన్నట్లు వ్యవహరించడం సరికాదు. రాజ్యాంగానికి, మౌలిక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదు, వ్యవహరిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయని ముందుగానే చెప్పారు. అలా కాకుండా, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తమకు అసలు వర్తించదు, అలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదు, పాటించం అన్నప్పుడు దాని మీద అప్పీలు చేయడం ఎందుకు? పూర్తిగా బుట్టదాఖలు చేయండి, అప్పీలు చేయకుండా వదిలేయండి. అధికారం ఉందని నమ్మబట్టే డివిజన్ బెంచికి వెళ్తున్నారు కదా.. అలాంటప్పుడు సోమవారం వరకు ఈ కేసు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో.. అప్పటివరకు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందే, ఆమెను సభలోకి అనుమతించాల్సిందే.

ఆ బాధ్యత రాజ్యాంగ పరిధిలో ఉన్నవాళ్లకు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లకు ఉంటుంది. లీగల్‌గా చూస్తే, కోర్టులో ఒక ఉత్తర్వు జారీ అయింది కాబట్టి ఆమెను లోపలకు రానిచ్చి తర్వాత అప్పీలు చేసుకోవాలి కానీ అసలు కోర్టుకు ఆ అధికారం లేదంటూ.. కోర్టుకు అప్పీలుకు ఎందుకు వెళ్లాలి? మీరే సర్వం సహాధికారులు అనుకున్నప్పుడు మీరే నిర్ణయించుకోండి, కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేయండి. కోర్టు తీర్పులను ధిక్కరించేవాళ్లు జైలుకు వెళ్తూనే ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే, చివరకు అసెంబ్లీ కార్యదర్శులు, మార్షల్స్ మాత్రమే అలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. అసలు ఈ ఉత్తర్వులు వాళ్లకు ఎవరు ఇచ్చారో తెలుసుకోవాలి. సరైనవాళ్లు వచ్చి కోర్టులో కూడా మూలాన్ని కత్తిరించే వ్యవహారం చేయాలి. కేవలం అప్పీలు వేసినంత మాత్రాన సింగిల్ జడ్జి ఉత్తర్వు సస్పెండ్ కాదు.. అప్పటివరకు ఆ తీర్పును అమలుచేయాల్సిందే. రాజ్యాంగం కంటే పార్లమెంటు కూడా సుప్రీం కాదు'' అని విస్పష్టంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement