ఇదే ఫైనల్
మొత్తంగా 31 జిల్లాలే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్న నాలుగు జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా ప్రతిపాదనను పరిశీలించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీ వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించింది. ఆ వివరాలను కేశవరావు.. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వివరించారు. గురువారం సీఎంకు తుది నివేదిక అందుతుంది. ముసాయిదాలో ప్రకటించిన 27 జిల్లాలు హైపవర్ కమిటీ పరిశీలిస్తున్న నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
నల్లగొండ జిల్లా దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని బుధవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సీఎంకు విన్నవించారు. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం... ప్రతిపాదిత 31 జిల్లాలకు మినహా మరే కొత్త జిల్లా డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించబోదని స్పష్టం చేశారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగానే ప్రభుత్వం అన్ని కోణాల నుంచి పరిశీలించి 31 జిల్లాల ప్రతిపాదనలను పరిశీలిస్తుందని చెప్పారు. అంతకుమించి ప్రభుత్వం వద్ద డిమాండ్లు పెట్టడం సరికాదని స్పష్టంచేశారు. అధికారులు కూడా ప్రతిపాదిత 31 జిల్లాల ఏర్పాటుపైనే దృష్టి సారించాలని, కొత్త జిల్లాల డిమాండ్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను సీఎం ఆదేశించారు. తెలంగాణలో 31 జిల్లాలకు మించి మరే కొత్త జిల్లా ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. 31 జిల్లాల ఏర్పాటు కూడా హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగానే జరుగుతుందన్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలే తప్ప కొత్త డిమాండ్లను పట్టించుకోవద్దని సీఎం నిర్ణయించారు.