నాచారం, న్యూస్‌లైన్: భారీ భవన నిర్మాణం కోసం తవ్విన పెద్ద గుంత.. అందులో పిల్లర్ల కోసం మరింత లోతైన గుంతలు.. వర్షాలకు నిండుగా చేరిన నీళ్లు.. అందులో ఈత కొట్టేందుకు దిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు విగతజీవులుగా మారారని తెలిసితల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. శుక్రవారం నాచారంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన వివరాలు ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం..
నాచారం విలేజ్‌కు చెందిన కందికంటి పాపయ్య కుమారుడు రాముడు (13) నాచారం ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. నాచారం వీఎస్‌టీ కాలనీకి చెందిన మచ్చ ఐలయ్య కుమారుడు శ్రావణ్ అలియాస్ బన్ని (9) తార్నాకలోని సెయింట్ డామిక్స్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. అదే కాలనీకి చెందిన మన్నె శంకర్ కుమారుడు రాజు (10) నాచారం ఇందిరా పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సాయి (10), నాచారం ఎర్రకుంటకు చెందిన హనుమంతు కుమారుడు బాలరాజు (11) లాలాపేట ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు.
వీరంతా స్నేహితులు. శుక్రవారం మధ్యాహ్నం తమ తమ పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షలు రాసిన అనంతరం ఒకచోట కలుసుకున్నారు. నాచారం రాఘవేంద్రనగర్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం తవ్వి వదిలేసిన భారీ గుంత వద్దకు ఈత కొట్టేందుకని వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీళ్లు చేరి గుంత నిండుగా ఉంది. సాయి తప్ప మి గతా వారంతా ఒక్కొక్కరుగా నీళ్లలోకి దిగారు. పోటీపడుతూ మధ్యలోకంటూ వెళ్లారు. అక్కడ పిల్లర్ల కోసం మరింత లోతుగా తవ్విన గుంత లో రాముడు, శ్రావణ్, రాజు, బాలరాజు చిక్కుకుని మునిగిపోయారు.
సాయం కోసం కేకలు వేశారు. దాంతో ఒడ్డునున్న సాయి భయంతో పారిపోయాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న స్థానికుడు విజయ్ పిల్లల కేకలు విని వెంటనే గుంతలోకి దిగాడు. అప్పటికే బాలరాజు నీట మునిగి మృతి చెందాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ముగ్గురితో పాటు బాలరాజు మృతదేహాన్ని విజయ్ బయటకు తెచ్చాడు. పరిస్థితి విషమంగా ఉన్న శ్రావణ్, రాముడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజు ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ రాధాకిషన్‌రావు, కార్పొరేటర్ నెమలి సురేష్ సంఘటన స్థలానికి వచ్చారు.
బిల్డర్ల నిర్లక్ష్యం.. కేసు నమోదు
నాచారం రాఘవేంద్రానగర్‌లోని పరుశరాం యాదవ్‌కు చెందిన సర్వేనంబర్ 153, 154లోని ఎకరన్నరం స్థలంలో బిల్ట ర్లు అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి బహుళ అంతస్తుల కోసం పెద్ద గుంతను తీసి వదిలేశారు. దీనికి జీహెచ్‌ఎంసీ అనుమతుల్లేవని సమాచారం. గుంత చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడమే ప్రమాదానికి కారణమైందనే కోణంలో కేసు నమోదు చేస్తున్నట్లు నాచారం సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.
గుంతలోకి దిగి ముగ్గురు చిన్నారుల మృత్యువాత
Published Sat, Oct 5 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement
Advertisement