హైదరాబాద్ నగరంలో స్వైన్‌ఫ్లూ వైరస్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో స్వైన్‌ఫ్లూ వైరస్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడి నగరంలో బుధవారం ముగ్గురు మృతిచెందారు. నాచారం ప్రాంతానికి చెందిన ఎనిమిది నెలల శిశువు నిఖిల్‌సాయి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో నాలుగు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల్లో హెచ్1ఎన్1 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బుధవారం పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందాడు.
గాంధీ ఆసుపత్రిలోనే స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్న జింబాబ్వే దేశస్థురాలు ప్రిసిల్లా (40) కూడా మృతి చెందింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి మృతి చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య 30కు చేరుకుంది. మరోవైపు కాటేదాన్, మైలార్‌పల్లి ప్రాంత వాసి పార్వతమ్మ కూడా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఒవైసీ ఆస్పత్రిలో చేరగా పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూసింది.