అనగనగా ఆ ముగ్గురు...
కావ్యాలకు కథా వస్తువు పురాణాల్లో దొరుకుతుంది. కథలకు శిల్పం ఊహల్లో తడుతుంది. కానీ ఒక నవలకు మాత్రం నేపథ్యం గతంలో ఎక్కడో తారసపడుతుంది. వర్తమానంలో గుర్తుకొస్తుంది. మంచి పుస్తక రూపంలో భవిష్యత్తుకు బహుమతి అవుతుంది. సస్య్‌కా జైన్ తొలినవల ‘ఫైర్ అండర్ యాష్’ కూడా ఇలా పుట్టిందే. ఢిల్లీలో ఒకప్పుడు ఆమెకు గోచరించిన పరిస్థితులకు అక్షరరూపమిది. తొలి నవలతోనే ది బెస్ట్ అనిపించుకుంటున్న సస్క్యా జైన్‌తో ‘సిటీప్లస్’మాటా మంతీ..
- ఓ మధు
తల్లి జర్మన్, తండ్రి ఇండియన్. పుట్టింది అహ్మదాబాద్‌లో, పెరిగింది ఢిల్లీలో. బెర్లిన్‌లో చదువు, బోస్టన్ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ.. మిడిల్ క్లాస్, ఐఏఎస్, పేజ్3 ఇలా రకరకాల ఫ్యామిలీస్‌తో ఉన్న స్నేహ సంబంధాలు.. ఇవన్నీ స్ఫూర్తినివ్వడంతో పాటు నన్ను రచయిత్రిని చేశాయేమో!.
ఎప్పుడూ అనుకోలేదు..
చిన్నప్పటి నుంచి రాసే అలవాటు వుంది. రచయిత్రిని కావాలని ప్లాన్ చేసిందేం లేదు. చిన్నప్పుడు నోట్స్ రాసేదాన్ని. కాస్త పెద్దయ్యాక సీరియస్‌గా రాయడం మొదలుపెట్టాను. చాలా కథలు, నోట్స్, ట్రాన్స్‌లేషన్ ఇలా ఎన్నో రాశాను. నేను చదువుకున్నప్పుడు కానీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఇలా పూర్తి స్థాయిలో రచయిత్రిగా మారాలని అనుకోలేదు. ‘ఫైర్ అండర్ యాష్’ కూడా ఏదో సీరియస్‌గా కదలకుండా కూర్చుని రాసిందేం కాదు.
డీడీ ఢిల్లీ..
ఢిల్లీలో పెరిగిన నేను ఆ సిటీని దగ్గరగా చూశాను. 90వ దశకానికి ముందు రేషన్ కార్డు, దూరదర్శన్‌తో సాగే మామూలు నగరంగా ఉన్న రాజధాని నగరం.. ఆర్థిక సంస్కరణల తర్వాత ఎన్నో వేగవంతమైన మార్పులకు వేదికైంది. ఈ మార్పులన్నీ చూస్తూ పెరిగాను. ఆనాటి పరిణామాలు మధ్యతరగతికి మేలు చేసినవే. వాటి వల్లే చ దువు, టెక్నాలజీ, సమాచారం.. ఇలా ఎన్నో అవకాశాలకు డోర్స్ ఓపెన్ అయ్యాయి.
ముగ్గురి కథ..
లోకల్స్‌కు ఢిల్లీలో నో ప్రాబ్లమ్. బయట నుంచి వచ్చి అక్కడ సస్‌టెయిన్ కావాలనుకునే వారికి మాత్రం కష్టమే. నగరం గురించి తెలిసుండాలి, పరిచయాలు చాలా అవసరం. కొత్తగా వచ్చిన వారికి ఎదురయ్యే సవాళ్లు మాములుగా ఉండవు. ఇదే ఈ పుస్తకం రాయటానికి మూలమని చెప్పాలి. పాట్నా నుంచి ఢిల్లీకి వచ్చిన స్టూడెంట్.. ఢిల్లీకి చెందిన ఒక డబ్బున్న అబ్బాయి.. వీరిద్దరికీ నచ్చిన ఒక అమ్మాయి. ఈ ముగ్గురు చుట్టూ కథ తిరుగుతుంది. కాలేజ్ రోజుల్లో నా ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు, వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ గుర్తున్నాయి. ఆ జ్ఞాపకాల్ని కూడా ‘ఫైర్ అండర్ యాష్’లో చేర్చాను.
నివురుగప్పిన నిప్పు
ఫైర్ అండర్ యాష్ అంటే.. నివురుగప్పిన నిప్పు. పైకి ఏమీ లేనట్టుగా కనిపిస్తూ లోపల దహిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితే ఢిల్లీలో చోటు చేసుకుంటుంది. ఇది ఢిల్లీకి ఒకవైపు అయితే.. రెండో వైపు క్లోజ్డ్ కమ్యూనిటీ వాతావరణం ఉంటుంది. ఇవన్నీ ఇందులో ఉంటాయి.