Boston University
-
ఎన్ఆర్ఐ అభిజిత్‌ది హత్యా? ఆత్మహత్యా? పోలీసుల ప్రకటన ఆంతర్యం ఏమిటి?
అమెరికాలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పరుచూరి అభిజిత్‌ది హత్యకాదని అమెరికా పోలీసులు తేల్చారు. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు తమ ప్రాథమిక విచారణలో హత్య అని అనుమానించేందుకు ఆధారాలేవీ లేవని చెప్పినట్లు న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు. అభిజిత్ అకాల మరణంపై విచారాన్ని వ్యక్తం చేసిన కాన్సులేట్, అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ఈ విషయంలో స్థానిక అధికారులతో పాటు భారతీయ-అమెరికన్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ ఎక్స్( ట్విటర్) పోస్ట్‌లో పేర్కొంది. దీంతో అభిజిత్ ఆత్మహత్య చేసుకున్నాడా?అనే అనుమానాలు తలెత్తెతున్నాయి. అదే నిజమైతే అభిజిత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అసలు డెడ్ బాడీ అడవిలోకి ఎలా వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తమ తనయుడు అభిజిత్‌ను మార్చి 11న యూనివర్శిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని కారులో అడవిలో వదిలివెళ్లారని ఆరోపించిన సంగతి తెలిసిందే. చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులు చాన్నాళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతని సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అదే రోజు గుర్తించడం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిజిత్ భౌతిక కాయానికి స్వస్థలం బుర్రిపాలెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఏడాది (2024) ప్రారంభం నుండి, అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు తొమ్మిది మంది మరణించడం విషాదం. Deeply saddened to learn about the unfortunate demise of Mr. Abhijeeth Paruchuru, an Indian student in Boston. Mr. Puruchuru’s parents, based in Connecticut 🇺🇸, are in direct touch with detectives. Initial investigations rule out foul play. @IndiainNewYork rendered… — India in New York (@IndiainNewYork) March 18, 2024 -
47 శాతం యాంటీబయోటిక్స్‌కు అనుమతుల్లేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేట్ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్లో కన్సల్టింగ్ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. -
హమ్మయ్య.. ఆర్.నాట్ తగ్గుముఖం!
సాక్షి, హైదరాబాద్: దేశంపైకి కరోనా దండెత్తి తొమ్మిది నెలలు దాటింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇంకెంత సమయం పడుతుందోనని ప్రజలంతా ఉస్సూరుమంటున్న వేళ ఎట్టకేలకు శుభ శకునాలు కనిపిస్తున్నాయి! దేశంలో ఒకవైపు రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతుండగా కరోనాను తట్టుకొనేందుకు కొత్త ‘అస్త్రశస్త్రాలు’సమకూరుతున్నాయి! దీంతో కరోనా వ్యాప్తికి బ్రేక్ పడినట్లేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి . రెండు వారాలుగా మారిన పరిస్థితి.. దేశంలో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 61.45 లక్షలకు చేరుకుంది. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గత రెండు వారాల్లో రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నెల 16న దేశంలో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలకు చేరుకోగా.. ఆ తరువాత కూడా కేసుల సంఖ్య పెరిగినప్పటికీ ఒక్క రోజులో నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నెల 17న అత్యధికంగా 97 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఐదు రోజులపాటు ఈ సంఖ్య తగ్గుముఖం పడుతూ 75 వేలకు చేరుకుంది. ఆ తరువాత కొంత పెరిగినప్పటికీ మంగళవారం మళ్లీ 70 వేల స్థాయికి పడిపోయింది. వ్యాధి బారినపడి కోలుకున్న వారి శాతం ఏకంగా 83 శాతానికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. కరోనా కిల్లర్ విటమిన్ డి! బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో విటమిన్ డి ద్వారా కరోనా తీవ్రతను తగ్గించవచ్చని తేలింది. శరీరంలో తగు మోతాదులో విటమిన్ డీ ఉంటే కరోనా కారణంగా ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవచ్చని, ముఖ్యంగా కృత్రిమంగా ఆక్సిజన్ అందించే అవసరాన్ని తగ్గించవచ్చని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. విటమిన్ డి సమృద్ధిగా ఉండి కరోనా బారినపడ్డ వారిలో చాలా తక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని తక్కువ ఉన్న వారిలో మరణాల రేటు రెట్టింపుగా ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. విటమిన్–డి శరీరంలో సైటోకైన్ ఉప్పెన ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుండవచ్చని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్ ఎఫ్.హోలిక్ తెలిపారు. స్పెయిన్‌లో జరిగిన పరిశోధనలోనూ విటమిన్ డితో కరోనా రోగులకు మేలు జరుగుతుందని వెల్లడైంది. యాంటీబయోటిక్తోనూ చికిత్స కోవిడ్ అనేది కరోనా వైరస్‌తో వచ్చే ఆరోగ్య సమస్య అయినప్పటికీ బ్యాక్టీరియాలను నిరోధించే ఓ మందుతోనూ మెరుగైన చికిత్స అందించవచ్చని ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు గుర్తించారు. టెయికోప్లానిన్ అని పిలిచే ఈ యాంటీబయోటిక్ సాధారణంగా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కోసం ఉపయోగిస్తూంటారు. ప్రస్తుతం కరోనా కోసం ఉపయోగిస్తున్న మందుల కంటే ఈ యాంటీబయోటిక్ పది రెట్లు ఎక్కువ సమర్థంగా పనిచేస్తుందని ఢిల్లీ ఐఐటీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. కొంత కాలం క్రితం రోమ్‌లో ఇదే మందుపై పరిశోధనలు జరిగాయని, అయితే ఇవన్నీ పరిశోధనశాలలోనే జరిగాయి కాబట్టి మందు సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టాలన్నారు. ఏమిటీ ఆర్.నాట్? కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి ఎంత మందికి వ్యాపిస్తుందో తెలియజేసే కొలమానమే ఆర్.నాట్ (ఖ0). ఇందులో ఆర్ అంటే రీప్రొడక్షన్ (పునరుత్పత్తి) కాగా, ‘0’ను ఆంగ్లంలో ‘నాట్’గా పిలుస్తారు. ఈ నెల 12 నాటికి దేశంలో ఆర్.నాట్ 1.1గా ఉండగా తాజాగా ఇది 0.98కి తగ్గినట్లు శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. అంటే ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాపిస్తే అది ఆర్. నాట్ 1గా లెక్క. ఒకరి నుంచి ఇద్దరికి వ్యాపిస్తే ఆర్.నాట్ రెండు అని అర్థం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల్లోనే ఈ తగ్గుదల నమోదు కావడం. ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా, బెంగళూరుల్లో ఇకపై కేసుల సంఖ్య ఎలా ఉంటుందన్న అంశం ఇప్పుడు కీలకమైంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎక్కువ కేసులు నమోదవుతుండటం వల్ల మొత్తమ్మీద ఆర్.నాట్ తగ్గుదల తక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడటం ద్వారానే కేసుల సంఖ్య, ఆర్.నాట్ పెరగకుండా చేయొచ్చని వారు స్పష్టం చేశారు. -
యాంటీ బయాటిక్స్ అతి వాడకం అనర్థమే
బోస్టన్: తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోని పిల్లలు వారి మొదటి ఐదేళ్ల జీవితంలో సగటున 25 యాంటీ బయాటిక్ ప్రిస్క్రిప్షన్లను అందుకుంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది వారిలో వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా యాంటి బయాటిక్ నిరోధకతను పెంచుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభానికి దోహదం చేసే ప్రధాన కారకాల్లో యాంటి బయాటిక్స్ వాడకం కూడా ఉందని తెలిపింది. -
చెదురుతున్న జ్ఞాపకాలు
బోస్టన్: ఫొటోల తరహాలోనే మన జ్ఞాపకాలు కూడా కాలక్రమేణా వాటి నాణ్యతను కోల్పోతాయని ఓ అధ్యయనంలో తేలింది. సాధారణంగా మనుషులు గతంలో చేసిన ఒక్కో ఘటనను ఒక్కో తరహాలో గుర్తుంచుకుంటారని ఈ పరిశోధనలో పాల్గొన్న బోస్టన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మౌరీన్ రిట్చీ తెలిపారు. గతంలో ఎదురైన పరిస్థితులను మరోసారి ఎదుర్కొన్నప్పుడు ఆ ఘటన తాలూకు ఎక్కువ విషయాలు మన మెదడులో నిక్షిప్తమవుతాయని వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఈ జ్ఞాపకాలు స్పష్టత లేకుండా, తక్కువ వివరాలతోనే గుర్తుంటాయని పేర్కొన్నారు. ‘భావోద్వేగ’ అంశాల్లో ఎక్కువ స్పష్టత.. రోజువారీ పనులతో పోల్చుకుంటే కారు ప్రమాదం వంటి ఘటనలు వ్యక్తుల మెదళ్లలో బలంగా నిక్షిప్తమవుతాయని గతంలో నిర్వహించిన పరిశోధనలో తేల్చినట్లు రిట్చీ చెప్పారు. ఇలా స్పష్టమైన జ్ఞాపకాలు ఏర్పడటానికి ఆయా వ్యక్తులు వాటిని ఎలా గుర్తుంచుకున్నారు? ఏరకంగా గుర్తుంచుకున్నారు? అనే విషయాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకునే దిశగా తమ పరిశోధన సాగిందని వెల్లడించారు. ఇందులో భాగంగా తాము మూడు పరిశోధనలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు మానసికంగా కలత కలిగించే చిత్రాలు, సాధారణ చిత్రాలను అందించామన్నారు. ఇవి వేర్వేరు రంగులు, నాణ్యతతో ఉన్నాయన్నారు. అనంతరం వారికి ఏం జ్ఞాపకం ఉందో చెప్పమని కోరగా నిజమైన చిత్రాలను తక్కువ నాణ్యతతో గుర్తుంచుకున్నట్లు తేలిందన్నారు. అలాగే మానసికంగా కలత కలిగించే చిత్రాలను చూసినవారు వాటిని అత్యంత కచ్చితత్వంతో గుర్తుంచుకున్నారనీ, వారి జ్ఞాపకాల నాణ్యత ఏమాత్రం తగ్గలేదని రిట్చీ చెప్పారు. ఫేడింగ్ ఎఫెక్ట్.. సాధారణ ఘటనలను గుర్తుంచుకునే క్రమంలో వాటికి సంబంధించిన చిన్నచిన్న అంశాలను మర్చిపోతారని రిట్చీ తెలిపారు. ఉదాహరణకు సంగీత విభావరికి వెళ్లిన వ్యక్తులు తమ ఇష్టమైన గాయకులను, సంగీతాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారన్నారు. అదే సమయంలో ఆ కార్యక్రమంలో వాతావరణం, లైట్లు, శబ్ద తీవ్రత చూచాయగా జ్ఞాపకం ఉంటాయన్నారు. ఇవి కాలక్రమేణా జ్ఞాపకాల నుంచి తొలగిపోతాయని వెల్లడించారు. దీన్ని ‘ఫేడింగ్ ఎఫెక్ట్’గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. నిజ ఘటనలతో పోల్చుకుంటే ఏ జ్ఞాపకాలైనా తక్కువ కచ్చితత్వంతోనే మెదడులో నిక్షిప్తమవుతాయన్నారు. ఇలా జరిగినప్పటికీ భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞాపకాలపై ఈ ఫేడింగ్ ఎఫెక్ట్ ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. -
శస్త్రచికిత్సలు చేసే రోబో స్పైడర్లు
బోస్టన్: అనుభవజ్ఞులైన వైద్యులు సైతం చేయలేని కొన్ని శస్త్రచికిత్సలను త్వరలో రోబో స్పైడర్లు చేయనున్నాయి. మృదువుగా, సౌకర్యంగా నాణెం పరిమాణంలో ఉండే ఈ రోబో సాలెపురుగు శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి శస్త్రచికిత్సను నిర్వహించనుంది. వైద్యులకు సహాయకారిగా ఉంటూ.. వారు చెప్పిన పనులను పూర్తి చేయనుంది. దీనిని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు తయారుచేశారు. మిల్లీమీటర్ సైజులో ఉండే ఆస్ట్రేలియాలోని పీకాక్ స్పైడర్‌ను ఆదర్శంగా తీసుకుని దీన్ని అభివృద్ధిచేశారు. 3 రకాల టెక్నాలజీల సాయం తీసుకొని మరో సరికొత్త టెక్నాలజీతో దీన్ని తయారుచేశారు. దీని తయారీలో సిలికాన్ రబ్బర్‌ను మాత్రమే వాడినట్లు పోస్ట్డాక్టరోల్ ఫెలో రుస్సో తెలిపారు. -
అనగనగా ఆ ముగ్గురు...
కావ్యాలకు కథా వస్తువు పురాణాల్లో దొరుకుతుంది. కథలకు శిల్పం ఊహల్లో తడుతుంది. కానీ ఒక నవలకు మాత్రం నేపథ్యం గతంలో ఎక్కడో తారసపడుతుంది. వర్తమానంలో గుర్తుకొస్తుంది. మంచి పుస్తక రూపంలో భవిష్యత్తుకు బహుమతి అవుతుంది. సస్య్కా జైన్ తొలినవల ‘ఫైర్ అండర్ యాష్’ కూడా ఇలా పుట్టిందే. ఢిల్లీలో ఒకప్పుడు ఆమెకు గోచరించిన పరిస్థితులకు అక్షరరూపమిది. తొలి నవలతోనే ది బెస్ట్ అనిపించుకుంటున్న సస్క్యా జైన్‌తో ‘సిటీప్లస్’మాటా మంతీ.. - ఓ మధు తల్లి జర్మన్, తండ్రి ఇండియన్. పుట్టింది అహ్మదాబాద్‌లో, పెరిగింది ఢిల్లీలో. బెర్లిన్‌లో చదువు, బోస్టన్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ.. మిడిల్ క్లాస్, ఐఏఎస్, పేజ్3 ఇలా రకరకాల ఫ్యామిలీస్‌తో ఉన్న స్నేహ సంబంధాలు.. ఇవన్నీ స్ఫూర్తినివ్వడంతో పాటు నన్ను రచయిత్రిని చేశాయేమో!. ఎప్పుడూ అనుకోలేదు.. చిన్నప్పటి నుంచి రాసే అలవాటు వుంది. రచయిత్రిని కావాలని ప్లాన్ చేసిందేం లేదు. చిన్నప్పుడు నోట్స్ రాసేదాన్ని. కాస్త పెద్దయ్యాక సీరియస్‌గా రాయడం మొదలుపెట్టాను. చాలా కథలు, నోట్స్, ట్రాన్స్లేషన్ ఇలా ఎన్నో రాశాను. నేను చదువుకున్నప్పుడు కానీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఇలా పూర్తి స్థాయిలో రచయిత్రిగా మారాలని అనుకోలేదు. ‘ఫైర్ అండర్ యాష్’ కూడా ఏదో సీరియస్‌గా కదలకుండా కూర్చుని రాసిందేం కాదు. డీడీ ఢిల్లీ.. ఢిల్లీలో పెరిగిన నేను ఆ సిటీని దగ్గరగా చూశాను. 90వ దశకానికి ముందు రేషన్ కార్డు, దూరదర్శన్‌తో సాగే మామూలు నగరంగా ఉన్న రాజధాని నగరం.. ఆర్థిక సంస్కరణల తర్వాత ఎన్నో వేగవంతమైన మార్పులకు వేదికైంది. ఈ మార్పులన్నీ చూస్తూ పెరిగాను. ఆనాటి పరిణామాలు మధ్యతరగతికి మేలు చేసినవే. వాటి వల్లే చ దువు, టెక్నాలజీ, సమాచారం.. ఇలా ఎన్నో అవకాశాలకు డోర్స్ ఓపెన్ అయ్యాయి. ముగ్గురి కథ.. లోకల్స్‌కు ఢిల్లీలో నో ప్రాబ్లమ్. బయట నుంచి వచ్చి అక్కడ సస్టెయిన్ కావాలనుకునే వారికి మాత్రం కష్టమే. నగరం గురించి తెలిసుండాలి, పరిచయాలు చాలా అవసరం. కొత్తగా వచ్చిన వారికి ఎదురయ్యే సవాళ్లు మాములుగా ఉండవు. ఇదే ఈ పుస్తకం రాయటానికి మూలమని చెప్పాలి. పాట్నా నుంచి ఢిల్లీకి వచ్చిన స్టూడెంట్.. ఢిల్లీకి చెందిన ఒక డబ్బున్న అబ్బాయి.. వీరిద్దరికీ నచ్చిన ఒక అమ్మాయి. ఈ ముగ్గురు చుట్టూ కథ తిరుగుతుంది. కాలేజ్ రోజుల్లో నా ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు, వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ గుర్తున్నాయి. ఆ జ్ఞాపకాల్ని కూడా ‘ఫైర్ అండర్ యాష్’లో చేర్చాను. నివురుగప్పిన నిప్పు ఫైర్ అండర్ యాష్ అంటే.. నివురుగప్పిన నిప్పు. పైకి ఏమీ లేనట్టుగా కనిపిస్తూ లోపల దహిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితే ఢిల్లీలో చోటు చేసుకుంటుంది. ఇది ఢిల్లీకి ఒకవైపు అయితే.. రెండో వైపు క్లోజ్డ్ కమ్యూనిటీ వాతావరణం ఉంటుంది. ఇవన్నీ ఇందులో ఉంటాయి.