జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. కనిపించకుండాపోయిన ముగ్గురూ ఒకే ప్రాంతానికి చెందినవారు. జవహర్‌నగర్‌లో నివసించే ఎ. శ్రీనిఖిత(21) హిందూ డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. ఈ నెల 19నుంచి జరగనున్న పరీక్షల కోసం హాల్ టికెట్ తెచ్చుకుంటానని గురువారం ఉదయం మేనత్త కూతురు రితికతో కలసి వెళ్లింది.
హాల్‌టికెట్ తీసుకున్న తర్వాత జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ దేవాలయానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇంటికి రాలేదు. ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అన్ని ప్రాంతాలు గాలించారు. స్నేహితులు, బంధువులతో పాటు స్వగ్రామంలోనూ ఆరా తీసినా ఉపయోగం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో కూడా వెళ్లిన రితిక కూడా కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పరీక్షలు రాయడానికి వెళ్లి...
బోరబండ ఎస్పీఆర్ హిల్స్ వినాయకనగర్‌లో నివసించే బి. ఎలీష(20) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. చార్మినార్ వద్ద రాయల్ ఉమెన్స్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండటంతో గురువారం ఉదయం 7గంటలకు బస్సులో చార్మినార్ వెళ్లింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం కావడంతో సాయంత్రం 5 అవుతున్నా ఎలీషా ఇంటికి రాకపోవడంతో ఆమె స్నేహితురాలు శ్రీదేవికి ఫోన్ చేశారు. అయితే ఎలీషా పరీక్ష రాయడానికి రాలేదని శ్రీదేవి వెల్లడించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.