
హైకోర్టు తీర్పుపై అప్పీలుకు!
యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తీర్పు ప్రతిని పరిశీలించాక స్పందిస్తా: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: జీవో 123ని హైకోర్టు రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై అప్పీల్‌కు వెళ్లాలని యోచిస్తోంది. హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆ దిశగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కోర్టును ఆశ్రయించిన వ్యవసాయ కూలీలకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా పాత జీవోకు సవరణలు చేసి కొత్త జీవోను తీసుకురావాలా..? అన్న అంశాన్ని సైతం పరిశీలిస్తోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సంక్లిష్టంగా ఉందని, ఎక్కువ జాప్యం అవుతుందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో 123 జీవో తెచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రైతుల సమ్మతితో భూమిని కొనుగోలు చేసింది. ఇటీవల మల్లన్నసాగర్ పరిధిలోని పలు గ్రామాల్లో భూసేకరణ సందర్భంగా ఇదే వివాదం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.
2013 చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు, రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు ఈ జీవోను తెచ్చినట్లు గతంలో ప్రభుత్వం పలుమార్లు చెప్పుకుంది. కానీ తాజాగా హైకోర్టు ఈ జీవోను కొట్టివేయటంతో తదుపరి చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది. కాగా, తీర్పు ప్రతిని పూర్తిగా పరిశీలించాకే స్పందిస్తానని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. తీర్పు కాపీని చదివిన తర్వాతే స్పందిస్తానని అన్నారు. 2013 చట్టానికి లోబడి సాగునీటి ప్రాజెక్టులకు వేగంగా భూసేకరణ చేయాలనే సదుద్దేశంతోనే ఈ జీవోను తీసుకువచ్చామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షాన వారి మేలు కోసమే పని చేస్తున్నట్లు చెప్పారు. 123 జీవో ద్వారా పేద ప్రజలకు, నిర్వాసితులకు మరింత మెరుగైన పరిహారం ఇవ్వాలని భావించామని, హైకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని కోరుతామని వివరించారు.
సమీక్షలతో సీఎం బిజీబిజీ
హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌తో భేటీ, ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్, సీఎంవో అధికారులతో చర్చలు, అనంతరం రాత్రి వరకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షలతో బిజీబిజీగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పు విషయంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.
కూలీలకు ప్రయోజనాలు దక్కడం లేదా?
భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు వివిధ ప్రాంతాల్లోని నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిర్బంధంగా భూములు లాక్కోవద్దని సూచించిన హైకోర్టు.. ప్రస్తుతం వ్యవసాయ కూలీలు వేసిన పిటిషన్‌పై జీవోను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో వ్యవసాయ కూలీలకు 123 జీవోతో నష్టం జరిగిందా? 2013 చట్టంలో వారికి ఉన్న ప్రయోజనాలు ఇప్పుడు వర్తించడం లేదా..? అన్నది చర్చనీయాంశమైంది. భూములు కోల్పోయి ఉపాధికి దూరమయ్యే వ్యవసాయ కూలీలకు భూసేకరణ చట్టం ప్రకారం.. సంబంధిత ప్రాజెక్టులతో ఉద్యోగాలు కల్పిస్తే బాధిత కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వడం, లేదా ప్రతి బాధిత కుటుంబానికి ఒకే దఫా రూ.5 లక్షల చెల్లింపు, లేదా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.2 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వార్షిక చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ 123 జీవోలో వ్యవసాయ కూలీల ప్రస్తావన లేకపోవటం గమనార్హం.