హక్కులను హరిస్తోంది
- జీవో 123పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- సాగునీటి ప్రాజెక్టులకు దాన్ని వర్తింపజేయొద్దు
- సర్కారును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు
- 123 జీవో కింద ఇక భూములు కొనొద్దు.. ఒప్పందాలు చేసుకోవద్దు
- ఇప్పటికే చేసిన భూ కొనుగోళ్లు చట్టవిరుద్ధమే
- వాటి చెల్లుబాటుపై తుది విచారణలో తేలుస్తాం
- 2013 భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకోవచ్చు
- బాధితులకు పునరావాసం, పునర్నిర్మాణం కల్పించాలి
- 2013 చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేయరాదు
- మౌలిక సదుపాయాల వంటి బాధ్యతలు రాష్ట్రానివే
- రాష్ట్రం తెచ్చిన జీవో 190లో ఇవేవీ లేవు
- బాధితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం లేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్:
సాగునీటి ప్రాజెక్టులకు భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాధిత కుటుంబాలకు (భూ యజమానులు కాదు) 2013 భూ సేకరణ చట్టం పలు హక్కులు, ప్రయోజనాలు కల్పిస్తున l్నందున భూముల కొనుగోలు కోసం జీవో 123ను వర్తింపజేయడానికి వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది. ‘‘స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచి భూముల కొనుగోలు నిమిత్తం తెచ్చిన జీవో 123ను అమలు చేసుకునే అధికారం 298వ అధికరణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న వారి హక్కులను, ముఖ్యంగా 2013 భూ సేకరణ చట్టంలోని షెడ్యూల్ 2, 3 కింద ఉన్నవారి హక్కులను హరించేలా జీవో 123 ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ జీవో కింద సాగునీటి ప్రాజెక్టుల అవసరాల కోసం భూములను కొనడానికి వీల్లేదు’’ అని స్పష్టం చేసింది. అంతేకాక ఈ జీవో కింద ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోవడానికి వీల్లేదంది. అయితే 2013 భూ సేకరణ చట్టం కింద భూములను తీసుకోవడానికి ఈ ఉత్తర్వులు ఎంతమాత్రం అడ్డంకి కాబోవని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది.
జీవో 123 ద్వారా ఇప్పటికే భూములమ్మిన వారికి (భూ యజమానులకు) కాక, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం 2013 భూ సేకరణ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేగాక, జీవో 123 కింద ప్రభుత్వం కుదుర్చుకున్న భూముల కొనుగోలు ఒప్పందాలు కూడా చట్ట విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు సరైనవేనా అన్న ప్రశ్నకు తుది విచారణ సమయంలో స్పష్టతనిస్తామంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘2013 భూ సేకరణ చట్టం అమల్లో ఉండగా దాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 298వ అధికరణ కింద తనకున్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి జీవో 123 ద్వారా భూములు కొనుగోలు చేయవచ్చా? భూ సేకరణ చట్టంతో సంబంధం లేకుండా జీవో 123 స్వతంత్రమైనదా? 298వ అధికరణ కింద రాష్ట్రానికి ఉన్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించకుండా 2013 చట్టం అడ్డుకుంటోందా? ఈ ప్రశ్నలన్నింటినీ తుది విచారణ సమయంలో పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం తన 80 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ంలో పలు సాగునీటి ప్రాజెక్టుల కోసం 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని జీవో 123 ద్వారా భూములు కొనుగోలు చేస్తుండటాన్ని సవాలు చేస్తూ మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. వాటిని సుదీర్ఘంగా విచారించి గత నవంబర్ 24న నిర్ణయాన్ని వాయిదా వేసిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం వెలువరించింది.
కేంద్ర చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేయడానికి వీల్లేదు
పార్లమెంటు చేసిన చట్టం అమలులో ఉంటూ సదరు అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు, 254(1) అధికరణ ప్రకారం ఆ చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర శాసనవ్యవస్థ ఎలాంటి చట్టమూ చేయడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘అలా చూస్తే పార్లమెంటు తెచ్చిన 2013 భూ సేకరణ చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది. కాబట్టి దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో చట్టం తేవడానికి వీల్లేదు. ఏ అంశంలోనైనా 2013 చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు చేసుక ునేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ఆస్కారం అసలే లేదు. ఉమ్మడి జాబితాలోని చట్టాల విషయంలో పార్లమెంటు చేసిన చట్టానికే ఎక్కువ విలువ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది.
అవేమీ జీవో 190లో లేవు
స్వచ్ఛందంగా కొనుగోలు చేసిన భూములపై ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తి కళాకారులు (భూ యజమానులు కాదు) తదితరుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ హరించజాలదని ఈ సం దర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘2013 చట్టం బాధిత కుటుంబాలకు ఆర్థిక పరిహార ప్రయోజనాలతో పాటు పునరావాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది. పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత ులకు నగదు పరిహార చెల్లింపులు చేస్తున్నా చట్ట ప్రకారం వారికి దక్కాల్సినవన్నీ దక్కడం లేదు. నిర్వాసితులై బతుకుదెరువు కోల్పోయిన బాధలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చేందుకు విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2013 చట్టంలో పలు ప్రయోజనాలను చేర్చారు. బాధిత కుటుంబాలకు 123 జీవో కింద ఇవి దక్కడం లేదు. ఇది వారి హక్కులను హరించడమే.
పైగా బాధితుల కోసం పలు సంక్షేమ చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 190 కూడా సంతృప్తికరంగా లేదు. బాధిత కుటుంబాలకు ఉద్యోగ కల్పన, శిక్షణ, కనీస వేతనాల గురించి 2013 చట్టంలో చట్టంలో స్పష్టంగా ఉంది. జీవో 190లో మాత్రం వాటి గురించి లేదు. అంతేకాక 2013 చట్టంలోని షెడ్యూల్ 3లో పేర్కొన్న ప్రకారం బాధిత కుటుంబాలకు మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ ఆ బాధ్యత గురించి జీవో 190లో ఎక్కడా ప్రస్తావనే లేదు’’ అని ఆక్షేపించింది.
14వ అధికరణకు విరుద్ధమని చెప్పజాలం
నిర్ధిష్ట ఆధారాలుంటే తప్ప వివాదాస్పద ప్రశ్నల జోలికి న్యాయస్థానాలు వెళ్లబోవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జీవో 123 కింద భూములమ్మాలని రైతులను ప్రభుత్వం బలవంతం చేస్తోందని పిటిషనర్లు చెబుతున్నారు. తామెవరినీ బలవంతం చేయడం లేదని, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారినుంచే భూములు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఈ విషయంలో న్యాయస్థానం పిటిషనర్ల వైపో, ప్రభుత్వం వైపో మొగ్గు చూపడం సమంజసం కాదు. స్వచ్ఛందంగా భూములిచ్చే వారి విషయంలో ఒకలా, భూ సేకరణ ద్వారా భూములిచ్చే వారి పట్ల ఒకలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న పిటిషనర్ల వాదనలో ఆమోదించాల్సినంత బలం లేదు. 2013 చట్టం కింద తీసుకుంటున్న భూములకు, జీవో 123 ద్వారా తీసుకుంటున్న భూవl¬లకు ఇస్తున్న పరిహార మొత్తాల్లో తేడాలున్నంత మాత్రాన దాన్ని వివక్షగా చెప్పజాలం. ఎందుకంటే స్వచ్ఛందంగా భూములు ఎవరిస్తున్నా వారికి ప్రభుత్వం అధిక పరిహారమే ఇస్తుంది. అలా ఇవ్వడం లేదని పిటిషనర్లు కూడా చెప్పడం లేదు. కాబట్టి 14వ అధికరణకు జీవో 123 విరుద్ధమని మేం చెప్పలేకున్నాం’’ అని పేర్కొంది.
ఆస్తి హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదు
2013 చట్టం కింద భూ సేకరణకు ముందు సామాజిక ప్రభావ, ఆహార భద్రత అధ్యయనం తప్పనిసరని ధర్మాసనం గుర్తు చేసింది. జీవో 123 కింద ఇవేమీ చేయడం లేదంది. ‘‘రాజ్యాంగంలోని 154, 162, 298 అధికరణల కింద తనకున్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 జారీ చేసింది. వర్తక, వాణిజ్యాలు, ఆస్తి సేకరణ, దాన్ని కలిగి ఉండే, విక్రయించే విషయాల్లో కార్యనిర్వాహక అధికారాన్ని ఉయోగించే అధికారం అధికరణ 298 కింద ప్రతి రాష్ట్రానికీ ఉంది. అయితే ఈ అధికారాలను పరిమితంగానే ఉపయోగించాలే తప్ప, అపరిమితంగా వాడరాదని స్వయానా 162వ అధికరణే చెబుతోంది’’ అని పేర్కొంది. అలాగే, ‘‘ఆస్తుల కొనుగోలు విషయంలో ఏ వ్యక్తితోనైనా ఒప్పందం కుదుర్చుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచి భూములు తీసుకుని వారితో ఒప్పందం కుదుర్చుకోవడానికీ అధికారముంది. అయితే 162వ అధికరణ కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి ఆస్తి హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాయడానికి వీల్లేదు. ఆ అధికారాన్ని ఓ చట్టం ద్వారా ఉపయోగించాలే తప్ప కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కాదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, ‘ప్రభ ుత్వం పొరుగున ఉన్న వారి భూములను కొనుగోలు చేస్తున్నంత మాత్రాన పిటిషనర్ల వంటివారి ఆస్తి హక్కును హరించినట్టు కాదని కూడా పేర్కొంది.
రాజ్యాంగంలోని 154, 162, 298 అధికరణల కింద తనకున్న కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 జారీ చేసింది. వర్తక, వాణిజ్యాలు, ఆస్తి సేకరణ, దాన్ని కలిగి ఉండే, విక్రయించే విషయాల్లో కార్య నిర్వాహక అధికారాన్ని ఉపయోగించే అధికారం అధికరణ 298 కింద ప్రతి రాష్ట్రానికీ ఉంది. అయితే ఈ అధికారాలను పరిమితంగానే ఉపయోగించాలే తప్ప, అపరిమితంగా వాడరాదని 162వ అధికరణే చెబుతోంది. – హైకోర్టు