
సీబీఐ విచారణకు సిద్ధపడాలి
- చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ డిమాండ్
- ఇది స్విస్ చాలెంజా.. సూట్‌కేస్ చాలెంజా?
- ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా లేదని జైట్లీ చేసిన ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు.. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని అంగీకరిస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. ప్రజాతీర్పు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు వేటిపైనా బాబుకు గౌరవం లేదన్నారు. స్విస్ చాలెంజ్‌పై తదుపరి ప్రక్రియను నిలిపేయాలని కోర్టు స్టే ఇచ్చినా.. మంత్రులు పుల్లారావు, నారాయణరావు అప్పీలుకు వెళ్లి దాన్ని కొనసాగిస్తామంటున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాల మీద, తాము వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
నిబంధనల్లో మతలబులు..
స్విస్ చాలెంజ్ విధానమే లోపభూయిష్టం కాగా.. అందులో పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కాకాని విమర్శించారు. ప్రభుత్వం 1690 ఎకరాల భూమి ఇవ్వడమే కాక రూ.12 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంటే... సింగపూర్ కంపెనీలు రూ.320 కోట్లు మాత్రమే పెడుతున్నాయని చెప్పారు. అయినా ప్రభుత్వానికి 42%, సింగపూర్ కంపెనీలకు 58% ఇస్తున్నారని తెలిపారు. వాళ్లు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు తిరిగి కట్టకపోయినా, 20 ఏళ్లలో ఎలాంటి సమస్య వచ్చినా భరించేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమని.. అందులో లబ్ధి పొందేది మాత్రం సింగపూర్ కంపెనీలని చెప్పారు. ఇది స్విస్ చాలెంజా.. చంద్రబాబు గారి సూట్‌కేస్ చాలెంజా? అని మండిపడ్డారు.