గురుకులాల్లో 2,444 పోస్టుల భర్తీకి సిద్ధం
అధికారులతో డిప్యూటీ సీఎం కడియం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వివిధ గురుకులాల్లో ఉన్న ఖాళీ పోస్టులు, కొత్తగా ఏర్పాటు చేయనున్న మైనా రిటీ గురుకులాల్లో 630 పోస్టులు కలుపుకుని మొత్తం 2,444 పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. బుధవారం సచివాలయంలో డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. ఈ పోస్టుల భర్తీ, నియామక నిబంధనలు, ఇతర అంశాలపై ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. ఈ పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
టీచర్ల రిక్రూట్‌మెంట్ తదితర అంశాలకు సంబంధించి ఆయా గురుకులాల్లో అనుసరిస్తున్న విధివిధానాల గురించి కడియం పరిశీలించారు. గురువారం మరోసారి సమావేశమై ఈ పోస్టుల భర్తీపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ సమావేశంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ డా.ఘంటా చక్రపాణి, మైనార్టీశాఖ ముఖ్యకార్యదర్శి ఒమర్ జలీల్, ఏసీబీ డీజీ ఏకేఖాన్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, ప్రభుత్వ(జనర ల్) గురుకులాల కార్యదర్శి శేషుకుమారి పాల్గొన్నారు.