
హైదరాబాద్ టెకీల నిరసన
హైదరాబాద్: నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు వెళ్లే రోడ్డును తవ్వడానికి జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని మహానగర టెకీలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు తవ్వకానికి వ్యతిరేకంగా టెకీలు ఆన్‌లైన్‌లో క్యాంపైన్ కూడా నిర్వహించారు.
క్యాంపైన్‌కు మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. కార్యాలయాలకు వాహనాలకు బదులు గుర్రాలపై వెళ్తూ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రస్తుతం ఉన్న తారు రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు.
వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలోపు ప్రస్తుతం ఉన్న తారు రోడ్డుకు ఎలాంటి ఢోకా ఉండబోదని కొందరు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు రోడ్డును తవ్వాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు తవ్వకం వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో పనిచేసే ఉద్యోగులకు ప్రయాణ సమయం రెండు నుంచి మూడు గంటల పాటు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో గుంతలో నిండిన రోడ్లు చాలానే ఉన్నాయని ముందు వాటిని సరిచేయాలని వ్యాఖ్యానిస్తున్నారు.