చార్జీల పెంపుపై నేడు నిరసనలు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీల పెంపుపై శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బస్సుచార్జీల పెంపు వల్ల పేద ప్రయాణికులపై, విద్యుత్ చార్జీల పెంపుతో అన్నివర్గాల ప్రజలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెనుభారం మోపిందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. చార్జీల పెంపు ఉండదని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేసిందని, దీనిని నిరసిస్తూ అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఊరేగింపులు, ధర్నాలు చేపట్టాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలను కోరారు.
ఇది బాధల తెలంగాణ: బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్, బాధల తెలంగాణను చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం కరెంటు, బస్సు చార్జీలను పెంచడం బాధాకరమని అన్నారు.