నేడే గ్రూప్–2 ప్రిలిమ్స్
ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు స్క్రీనింగ్ టెస్ట్
9.45 దాటితే పరీక్ష కేంద్రంలోకి ‘నో’ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 982 గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి ఆదివారం ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష జరగనుంది. దీనికి ఏపీతో పాటు తెలంగాణ నుంచి మొత్తం 6,57,010 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. ఏపీలో 1,376 పరీక్ష కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 86 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు తమ కేంద్రానికి ఉదయం 9 గంటల నుంచి 9.45 లోపు హాజరుకావాలి. 9.45 తర్వాత అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌పై ఫొటో స్పష్టంగా లేకపోతే మూడు పాస్‌పోర్టు ఫొటోలు వెంట తీసుకువెళ్లాలి. వాటిని ఇన్విజిలేటర్‌కు ఇచ్చి డిక్లరేషన్ ద్వారా పరీక్షకు హాజరుకావచ్చు. కాగా అన్ని పరీక్ష కేంద్రాల సమాచారాన్ని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఏమైనా సమస్యలు ఏర్పడితే 040–24603493, 94, 95, 96 నంబర్లను సంప్రదించవచ్చు.