గ్రూప్‌–2 ఫలితాల విడుదల  | Release of Group2 Results | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 ఫలితాల విడుదల 

Published Thu, Apr 11 2024 5:06 AM | Last Updated on Thu, Apr 11 2024 5:06 AM

Release of Group2 Results - Sakshi

మెయిన్స్‌కు 92,250 మంది అర్హత.. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన ఏపీపీఎస్సీ 

డిసెంబర్‌లో 897 పోస్టులకు నోటిఫికేషన్‌.. తాజాగా 905కి పెరిగిన పోస్టుల సంఖ్య 

ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహణ 

45 రోజుల రికార్డు వ్యవధిలో ఫలితాల ప్రకటన.. జూలై 28న మెయిన్స్‌ నిర్వహణ  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌–2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన 45 రోజుల రికార్డు వ్యవధిలోనే ఫలితాలను కూడా వెల్లడించింది. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 7న ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు ఫిబ్రవరి 25న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు 4,04,039 మంది (87.17 శాతం) హాజరయ్యారు.

సర్విస్‌ కమిషన్‌ గతంలో నిర్వహించిన గ్రూప్‌–2తో పాటు ఇతర పరీక్షలకు గరిష్టంగా 70 శాతం మాత్రమే హాజరవగా, ఈ ఏడాది ప్రిలిమ్స్‌కు మాత్రం భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం గమనార్హం. తొలుత మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. అయితే, నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందికి మెయిన్స్‌ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఏపీపీఎస్సీ డిసెంబర్‌ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం మరో 8 పోస్టులు నోటిఫికేషన్‌కు కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి పెరిగాయి. పెరిగిన పోస్టుల ఆధారంగా మెయిన్స్‌కు మొత్తం 92,250 మందిని ఎంపిక చేశారు. గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షను జూలై 28న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

సర్విస్‌ కమిషన్‌ పరీక్షల నిర్వహణలో అనేక సవాళ్లు, ఆటంకాలు ఎదురయ్యాయని, అయినా.. గ్రూప్‌–2, గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన పూర్తి సహకారంతో తక్కువ సమయంలోనే గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ ఫలితాలను సైతం ప్రకటించామని ఆయన తెలిపారు.  

92,250 మందికి మెయిన్స్‌కి చాన్స్‌ 
2018లో నిర్వహించిన గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ రాసినవారి నుంచి 1:12 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయగా.. ఈసారి ఎక్కవ సంఖ్యలో 92,250 మంది అభ్యర్థులకు మెయిన్స్‌ రాసే ఛాన్స్‌ లభించింది. గ్రూప్‌ పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం సర్విస్‌ కమిషన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

కాగా, కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, గ్రేడ్‌–3 మునిసిపల్‌ కమిషనర్‌ పోస్టులు 4, గ్రేడ్‌–2 సబ్‌ రిజి్రస్టార్‌ 16, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ 28 పోస్టులతో కలిపి 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి.

నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఏఓ), సీనియర్‌ ఆడిటర్, ఆడిటర్‌ ఇన్‌ పే అండ్‌ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 566 ఉన్నాయి. కాగా, ఆబ్జెక్టివ్‌ విధా­నంలో నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలో పేప­ర్‌–­1, పేపర్‌–2 150 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్న­లకు జవా­­బు­లు గుర్తించాలి. పూర్తి వివరాలకు కమి­షన్‌ వెబ్‌సైట్‌ http://www.psc.ap.gov.in లో చూడవచ్చు.  

నిరుద్యోగులకు ఎంతో మేలు 
గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ పరీక్షను అడ్డుకునేందుకు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవేమీ ఫలించలేదు. ఇంత తక్కువ సమయంలో ఫలితాలను ప్రకటించడం చాలా గొప్ప విషయం. నిరుద్యోగుల పట్ల సీఎంకు చిత్తశుద్ధి ఉంది. చెప్పిన సమయానికి ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది.

నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు 1:100 నిష్పత్తిలో గ్రూప్‌–2 మెయిన్స్‌కు ఎంపిక చేయడం అభినందనీయం. చరిత్రలో ఇంతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం. ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – వై.రామచంద్ర, అధ్యక్షుడు, నిరుద్యోగ ఐక్య సమితి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement