ఎండః 40.6 డిగ్రీలు
నేడు,రేపు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం
సిటీబ్యూరో: భానుడు భగ్గుమంటున్నాడు. గ్రేటర్‌పై నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. ప్రజలు అడుగు బయట పెట్టేందుకే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం గరిష్టంగా 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల మేర నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకూ ఎండ వేడిమి తగ్గడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్రయాణికులు వడదెబ్బకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి.
గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మండు వేసవి, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. గాలిలో తేమ 24 శాతానికి పడిపోవడంతో చర్మం, కళ్ల సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వేసవి తాపం నుంచి రక్ష ణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.