నేడు ఉరుములతో గాలివానలు
బూర్గుంపాడులో 11 సెంటీమీటర్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు మోస్తరు వర్షాలతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రుతుపవన ద్రోణి ఉత్తర దిశగా హిమాలయాలవైపు వెళ్లిపోవడంతో రుతుపవనాలు బలహీనమయ్యాయి. దీంతో ఎండలు పెరుగుతున్నాయి. తేమ ఎక్కువ ఉండటం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడా మంగళవారం ఉరుములతో కూడిన గాలివానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరో 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. బూర్గుంపాడులో 11 సెం.మీ. భారీ వర్షం కురిసింది. డోర్నకల్‌లో 7, బోనకల్, గంగాధరలలో 6 సెం.మీ, వెంకటాపూర్, గార్ల, భద్రాచలం, పాలకుర్తి, హసన్‌పర్తిలలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..: మరోవైపు రాష్ట్రంలో అనేక చోట్ల ఎండలు మండిపోతున్నాయి. గత 24 గంటల్లో మెదక్‌లో ఐదు డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పూర్వ జిల్లా కేంద్రాలన్నింటా 2 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో 3 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డు అయింది. రాత్రి ఉష్ణోగ్రత కూడా నగరంలో 3 డిగ్రీలు అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.