మాదాపూర్: రాష్ట్రంలో పర్యాటక రంగం 25 శాతం అభివృద్ధి చెందిందని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ట్రావెల్ టూరిజం ఫేర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజ్మీరా చందులాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కట్టడాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే సందర్శకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ టూరిజం ఫేరులో 182 ఎగ్జిబిటర్లతో స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఫేర్‌లో బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్‌లో 20 శాతం, ట్రాన్స్‌పోర్టులో 10 శాతంలతో పాటు వివిధ విభాగాల్లో ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది.