సంస్థాగతమే ప్రధాన ఎజెండా!
► నేడు టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం, ఎంపీల భేటీ
► హాజరు కానున్న గులాబీ అధినేత కేసీఆర్
► పలు కీలకాంశాలపై చర్చించే అవకాశం
► నామినేటెడ్ పదవుల పంపకంపైనా సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీలో ‘సంస్థాగత’ సందడి మొదలైంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. గత ఏడాది ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అంతకు ముందే ఆయా జిల్లాల్లో అధ్యక్షుల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇది జరిగి ఏడాది కావొస్తున్నా పార్టీ సంస్థాగత కమిటీలను మాత్రం నియమించలేదు.
అధికారిక పదవులు కాదు కదా, కనీసం పార్టీ పదవులు కూడా లేకుండా పోయాయన్న ఆవేదన పార్టీ నాయకుల్లో వ్యక్తమైంది. వరుసగా వచ్చిన ఎన్నికల వల్ల పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టిపెట్టలేదన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో వ్యక్తమయ్యింది. దీంతో పాటు ప్రభుత్వం నియమించాల్సిన ‘నామినేటెడ్ ’ పదవుల పంపకమూ జరగలేదు. మరో నెల రోజుల్లోనే పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం సాయంత్రం 3 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు.