కారు కాదు రాకెట్
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం మిన్నంటిన సంబరాలు
పార్టీ శ్రేణుల్లో ఉప్పొంగిన ఉత్సాహం వాడవాడలా విజయోత్సవాలు
గ్రేటర్‌లో కారు దుమ్ము రేపింది. ఆకాశమే హద్దుగా... రాకెట్‌లా దూసుకుపోయింది. కారు రేపిన దుమ్ములో సైకిల్, కమలం, హస్తం అడ్రస్‌లు గల్లంతయ్యాయి. గులాబీ గాలి ముందు ఏ పార్టీ నిలవలేకపోయింది. కారు దెబ్బకు సైకిల్ ముక్కలు చె క్కలైంది. టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని అందరూ లెక్కలేస్తే...‘సింగిల్’ సీటుకే పరిమితమైంది.
ఆ పార్టీకి ‘మహా’దెబ్బ పడింది. సైకిల్‌తో జత కట్టిన పాపానికి కమలమూ వాడిపోయింది. నిన్నటి వరకూ గ్రేటర్ పాలనలో భాగం పంచుకున్న కాంగ్రెస్‌కు తేరుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లింది. టీఆర్‌ఎస్ తరువాత అత్యధిక సీట్లను మజ్లిస్ పార్టీ గెలుచుకుంది.