టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే?
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం కసరత్తు జరిపారు. జిల్లాల వారీగా ఆశావహుల పేర్లను పరిశీలించి.. దాదాపుగా అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్టు తెలిసింది. కరీంనగర్ జిల్లా అభ్యర్థులుగా భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్‌రావు, నిజామబాద్ జిల్లా నుంచి భూపతిరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జగదీశ్వర్‌రెడ్డి, ఖమ్మం నుంచి బాలసాని, మెదక్ నుంచి భుపాల్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్ పేర్లను దాదాపు ఖరారుచేసినట్టు తెలిసింది.
అదేవిధంగా మహబూబ్‌నగర్ నుంచి పోటీచేయనున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తమకే మెజారిటీ ఉందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దుబాట్ల విషయమై జానారెడ్డితో సహా ఎవరితో మాట్లాడలేదని కేకే స్పష్టం చేశారు.