సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షాల(టీఆర్‌ఎస్ ఎల్పీ) సంయుక్త సమావేశం శుక్రవారం జరగనుంది. తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరు కావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ నేత శ్రావణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితి, మంచినీటి ఎద్దడి, పశుగ్రాసం సమస్యలపై చర్చించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల తీరుతెన్నులపైనా సమీక్ష ఉంటుంది.
ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినం సందర్భంగా సమావేశాలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై చర్చించనున్నారు. 50లక్షల మంది పార్టీ సభ్యుల బీమాను రెన్యువల్ చేయడం, పార్టీ ఆర్థిక స్థితిగతులపైనా ఈ సమావేశంలో చ ర్చిస్తారు. హైదరాబాద్, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా రంజకంగా ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
రేపు టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం
Published Thu, Mar 17 2016 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement