ట్రస్ట్ చేతిలో ‘ట్రాఫిక్’ నిర్వహణ!
స్ఫూర్తిదాయకంగా ‘సూరత్’ విధానాలు
{పత్యేకంగా ట్రాఫిక్ బ్రిగేడ్ వ్యవస్థ
ఫ్లైఓవర్ల నిర్మాణంలోనూ వ్యూహాత్మక వైఖరి
‘జామ్’ఝాటానికి చెక్
సిటీబ్యూరో: నానాటికీ పెరిగిపోతున్న వాహనాలు...ఆ స్థాయిలో పెరగని ట్రాఫిక్ సిబ్బంది... రిటైర్మెంట్స్‌తో తరిగిపోతున్న అధికారులు, సిబ్బంది.... పోస్టులు కేటాయించని, భర్తీ చేయని ప్రభుత్వం...నిత్యం ప్రజలకు ట్రాఫిక్ నరకం... కేవలం హైదరాబాదే కాదు దేశ వ్యాప్తంగా అనేక నగరాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. గుజరాత్ ఆర్థిక రాజధానిగా పిలిచే సూరత్ నగరం మాత్రం ఈ సమస్యను ‘ట్రస్ట్’ ద్వారా అధిగమించింది. మరోపక్క వ్యూహాత్మకంగా ఫ్లైఓవర్లను నిర్మించుకుంటూ రోడ్ల విస్తీర్ణం సమస్యకూ చెక్ చెబుతోంది. ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ విషయంలో ఆదర్శంగా నిలుస్తోంది.
‘సేఫ్ సిటీ’ కోసం ఏర్పాటై...
సూరత్ నగరంలో ‘సేఫ్ సిటీ ప్రాజెక్టు’ కోసం స్థానికుల నుంచే విరాళాలు సేకరించారు. దీనికోసం అక్కడి పోలీసు కమిషనర్ నేతృత్వంలో ‘ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. ఇందులో ఆ నగరానికి చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. స్థానిక వ్యాపారులు విరాళంగా ఇచ్చిన రూ.46 కోట్లతో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ఆ తర్వాతా తన సేవలు కొనసాగిస్తోంది. నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాల కోసం ఎదురుచూడకుండా చొరవ తీసుకుని సేవలు ప్రారంభించింది.
హోంగార్డుల స్థానంలో బ్రిగేడ్స్...
ఇతర నగరాల్లో పోలీసు విభాగానికి అనుబంధంగా హోంగార్డ్స్ వ్యవస్థ ఉంది. ఈ తరహాలోనే సూరత్‌లో ట్రా ఫిక్ నిర్వహణ కోసం ట్రాఫిక్ బ్రిగేడ్‌లను నియమించుకున్నారు. హోంగార్డులకు జీతా న్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా... బ్రిగేడ్స్‌కు ట్రస్ట్ చెల్లిస్తుంది. స్థానికుల్లో ఆసక్తి కలిగి, కనీస విద్యార్హత కలిగిన వారిని ఎంపిక చేసుకుని ప్రాథమిక శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ నియంత్రణకు వినియోగిస్తున్నారు. వారి అవకాశాన్ని బట్టి పార్ట్ టైమ్, ఫుల్ టైమ్‌ల్లో పని చేస్తున్న ఈ బ్రిగేడ్స్‌కు నెలకు రూ.మూడు వేల నుంచి రూ.5 వేల వరకు జీతం చెల్లిస్తున్నారు. ఇప్పటికీ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు వ చ్చిన విరాళాల నుంచే వీరి జీతభత్యాల చెల్లింపులు చేస్తున్నారు.
ప్రణాళిక బద్ధంగా ఫ్లైఓవర్లు...
వాహనాల నియంత్రణ అనేది ఎక్కువగా జంక్షన్లలోనే అవసరం. నగరం విషయానికి వస్తే ఇతర ప్రాంతాల కంటే కూడళ్ళలోనే ట్రాఫిక్ నియంత్రణకు ఎక్కువ మంది సిబ్బందిని మోహరించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఆ నగర వ్యాప్తంగా మొత్తం 32 జంక్షన్లు ఉండగా... 30 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 వివిధ ప్రాంతాల్లో, వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జంక్షన్లపై ఉన్న ఫ్లైఓవర్ల ఫలితంగా దాదాపు ఏ ప్రాంతంలోనూ వాహనాలు ఆగాల్సిన పని లేకుండానే ముందుకు వెళ్తుంటాయి.
‘కళ్లెం’ వేసేందుకు టెక్నాలజీ వినియోగం...
జంక్షన్లు కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉల్లంఘనులకు కళ్లెం వేయడానికి సూరత్ నగరంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. నో పార్కింగ్‌లో ఆగిన, రాంగ్ సైడ్‌లో వస్తున్న, సిగ్నల్ జంప్ చేస్తున్న వారిని గుర్తించడానికి సీసీ కెమెరాలు అనుసంధానించి ఉండే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్స్ ఏర్పాటు చేశారు.
ఇలాంటి ఉల్లంఘనల్ని అవే గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ఆటోమేటిక్‌గా ఈ-చలాన్ పంపిస్తాయి. సూరత్‌ను ఆనుకుని ఉన్న సువిశాలమైన రహదారులపై గంటకు 100 కిమీ మించిన వేగంతో ప్రయాణించే వాహనాలను సీసీ కెమెరాలు గుర్తిస్తాయి. అలాంటి వాహనాల యజమానుల వద్దకు వెళ్ళే పోలీసులు వాటిని సీజ్ చేసి న్యాయస్థానానికి తరలిస్తుంటారు.