ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా:రేవంత్
-టీఆర్‌ఎస్ వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలి
- ఎన్నికల సంఘానికి, ప్రెస్ కౌన్సిల్‌కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్: తన ఊహలను త్రీడీ బొమ్మల రూపంలో చిత్రీకరించి ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి విమర్శించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అభివృద్ధి నమూనాలను పత్రికల్లో ప్రచురించి డబ్బు సంపాదించడంతో పాటు ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈ నెల 23న 'నమస్తే తెలంగాణ' పత్రికలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు మెట్రో రైలు విస్తరణ పనులు , దుర్గం చెరువు మీద 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లు పిలుస్తున్నారంటూ వార్తలు ప్రచురితమయ్యాయని తెలిపారు. ఈ అంశాలు ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపుతాయన్నారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలని కోరారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు టెండర్లు కేసీఆర్ వద్ద ఉండే ఓ చిత్రగుప్తుడు భేతాళ మాంత్రికుని బినామీ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పాలమూరు టెండర్ల ద్వారా వచ్చిన కమీషన్లతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు 66 డివిజన్‌లు ఉన్న రంగారెడ్డి జిల్లాకు పనికొచ్చే ఎత్తిపోతల పథకం టెండర్లను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.
దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని, నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూస్ ఛానెళ్లలో వచ్చే వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలని, టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖాతాల్లో జమచేయాలని కోరారు. ఎన్నికల్లో రూ. 5లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వారిని అనర్హులుగా ప్రకటించాలన్నారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.