కొత్త జిల్లాల మాటున కుట్ర
టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల మాటున దాగిన కుట్ర గురించి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లాల విభజన పేరుతో నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రభావం చూపేలా సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్ర గురించి కేంద్ర హోంశాఖకు, న్యాయశాఖకు వివరిస్తామన్నారు. తమ పార్టీ నేతలు దసరా తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.
పరిపాలనా సౌలభ్యం పేరుతో సీఎం కేసీఆర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఎదిగివస్తున్న ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని అణచి వేయడానికి, తనకు అడ్డంకిగా ఉన్న నేతలను దెబ్బతీయడానికి జిల్లాల పేరుతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త జిల్లాల వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా కేసీఆర్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. అసెంబ్లీని వాయిదా వేసి కొత్త జిల్లాలకు సీఎం ఏర్పాటు చేస్తుంటే నిలదీసి పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు వంతపాడుతున్నారన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం తయారు చేయించిన కాంగ్రెస్ నాయకులు రాష్ర్టంలోనే ఉన్నారని, ఈ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే ఎందుకు నోరు విప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దాని ప్రభావం రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై పడుతుందన్నారు. డీలిమిటేషన్‌పై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చూసినా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల సరిహద్దులు మార్చడానికి వీలులేదన్నారు.
డీలిమిటేషన్‌కు ముం దుగానే సరిహద్దులు, పరిధిని మార్చడం ద్వారా తాను అనుకున్న విధంగా నియోజకవర్గాల రిజర్వేషన్లు వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టివిక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య వంటి కొందరి నియోజకవర్గాలు ఎస్సీల నుంచి జనరల్‌గా మారిపోతాయన్నారు.