హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండు బడ్జెట్లు మాత్రమే పెట్టే అవకాశం ఉందని తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లు అభూత కల్పన మాత్రమే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ సక్రమంగా అమలుకావడం లేదని ఆరోపించారు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్కు రేవంత్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడుతూ... రైతు రుణమాఫీ సక్రమంగా అమలుకావడం లేదని ఆరోపించారు. కేజీ టూ పీజీ ఫీజురియింబర్స్మెంట్, ఇతర పథకాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు.