పులివెందులలో టీడీపీ జెండా ఎగరేయడం దేవుడెరుగు కాని ఆ జెండా కుప్పంలో వాలిపోకుండా చూసుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి సీఎం చంద్రబాబుకు సూచించారు. శుక్ర వారం ఇందిర భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
80 శాతం ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారని బాబు చేయించిన సర్వేలో వెల్లడి కావడం విడ్డూరంగా ఉందని ఇదే నిజమైతే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీలు, ఆరు స్థానాల్లో జడ్పీటీసీ, వందకు పైగా ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తన ప్రభుత్వంపై 80 శాతం ప్రజలు అసంతప్తితో ఉన్నారని చంద్రబాబుకు తెలిసే ఎన్నికలకు పోవడం లేదన్నారు. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 600 వాగ్ధానాల్లో ఆరింటినైనా నెరవేర్చలేదన్న విషయం ఆ పార్టీ నేతలందరికీ తెలిసినా నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారని ఆయన ఆరోపించారు.