
రవి ప్రకాష్
హైదరాబాద్: టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ ఈరోజు ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ9 న్యూస్‌చానల్‌పై, ఆ సంస్థ సీఈఓ రవిప్రకాష్‌పైన జూన్లో ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 12వ తేదీ రాత్రి 8.30 గంటలకు టీవీ9లో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేశారని ఆరోపిస్తూ 18న ఎల్‌బీనగర్‌కు చెందిన న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్కు నోటీసులు జారీ చేశారు. రవిప్రకాష్ ఈరోజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిసేపు అతనిని ప్రశ్నించారు. ఆ తరువాత అతనిని పంపించివేశారు.