పుష్కరాలకు భారీ బందోబస్తు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల్లో బందోబస్తు చర్యలు పుష్కలం. పోలీసులు పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 12(శుక్రవారం) నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో దాదాపు 13,474 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఘాట్ల వద్ద 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మేజర్, మైనర్, లోకల్ ఘాట్లు 57 వరకు ఉన్నాయి. వీటి వద్ద భద్రత కోసం 6,754 మంది పోలీసులను కేటాయించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని బాగా రద్దీ ఉండే అవకాశమున్నా బీచుపల్లి ఘాట్‌కు శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌ను ఇన్‌చార్జిలుగా నియమించినట్లు తెలిపారు. అలంపూర్ పుష్కర ఘాట్‌కు ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఈగలపెంట వద్దనున్న ఘాట్‌కు సెక్యూరిటీ వింగ్ జాయింట్ సీపీ మహేందర్ కుమార్ రాథోడ్, కృష్ణా గ్రామం వద్దనున్న ఘాట్‌కు సీఐడీ ఎస్పీ ఎం.శ్రీనివాసులుకు భద్రతా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని 28 పుష్కరఘాట్ల భద్రత కోసం 6,720 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో రద్దీగా ఉండే వాడపల్లి ఘాట్‌కు నార్త్‌జోన్ ఐజీ వై నాగిరెడ్డి, సాగర్ ఘాట్‌కు డీఐజీ ఎంకే సింగ్, మఠంపల్లి ఘాట్‌కు గ్రేహౌండ్స్ ఎస్పీ తరుణ్‌జోషిని కేటాయించినట్లు తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు
పుష్కర భక్తులకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను అంచనా వేసి అదుపు చేసేందుకు రెండు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో 55, మహబూబ్‌నగర్ జిల్లాలో 33 ట్రాఫిక్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. రహదారి వెంబడి ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను నెలకొల్పిన్లు తెలిపారు. మహిళలపై వేధింపులు జరగకుండా చూసేందుకు 27 ‘షీ’ టీమ్‌లను, సంఘవిద్రోహ చర్యలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 80 చెక్ టీమ్‌లను నియమించామని పేర్కొన్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద దాదాపు 555 సీసీ కెమెరాలతో ఎల్లవేళలా గస్తీ నిర్వహిస్తామని వివరించారు. రెండు జిల్లాల ఎస్పీలు భక్తుల సౌకర్యార్థం కోసం మొబైల్ యాప్‌లను ఏర్పాటు చేశారన్నారు.