ఒకింత మోదం.. మరింత ఖేదం
అరుణ్ జైట్లీ ఆశల బడ్జెట్ గ్రేటర్ సిటీజన్లకు ఒకింత మోదం.. మరింత ఖేదం మిగిల్చింది. బుధవారం నాటి కేంద్ర బడ్జెట్ వేతనజీవుల అంచనాలను పూర్తిగా నిజం చేయలేకపోయింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. తాజా బడ్జెట్‌తో మహానగరంలో ఇక విందు, వినోదం, విమానయానం భారంగా పరిణమించనుంది. స్మార్ట్ ఫోన్లు, కార్లు, బైకుల ధరలు పెరిగే అవకాశం ఉండడంకుర్రకారుతోపాటు మధ్యతరగతికి ఇబ్బందిగా మారింది. ఇక ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారీ సిగరెట్లు, పాన్‌మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం ధరలు పెరగడం పెద్దగా ఆశ్చర్యపర్చలేదు. ఐటీ రంగంతోపాటు..స్టార్టప్‌లు..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పలు రాయితీలు ప్రకటించడంతో ఆయా సంస్థలు సిటీకి వెల్లువెత్తనున్నాయి.
ఎన్నో ఆశించిన నగరవాసిని అరుణ్‌జైట్లీ బడ్జెట్ నిరాశ పరిచింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లింది. మూడు నుంచి ఐదు లక్షల మధ్య ఆదాయం ఉండే వారికి కేవలం ఐదుశాతం పన్నుతో సరిపెట్టడం గుడ్డిలో మెల్ల. కాస్మొపాలిటన్ నగరంగా మారిన మహానగరంలో తాజా బడ్జెట్‌తో విందు, వినోదం, విమానయానం భారం కానుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు ప్రియం కానుండడం యువత జేబులకు చిల్లులు పడడం తథ్యమన్న సంకేతాలు వెలువడ్డాయి. కార్లు, బైక్‌ల ధరలు పెరగడం మధ్యతరగతి వర్గానికి చేదువార్త.
ఔషధాలు, మెడికల్ ఉపకరణాల ధరలు తగ్గడంతో అందరికీ వైద్యం అందుబాటులోకి రానుండడం ఆనందిచదగ్గ విషయం. సిగరెట్లు, పాన్ మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం ధరలు పెరగడం పొగ, మందుబాబుల జేబుకు చిల్లు తప్పదు. ఐటీరంగంతో పాటు.. స్టార్టప్‌లు.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు ప్రకటించడంతో కొత్త పరిశ్రమలకు గ్రేటర్ నగరం కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. సీసీటీవీల ధరలు దిగిరానుండడంతో నగరంలో ప్రతి ఇల్లు, కార్యాలయం ఆవరణలో నిఘాకు మార్గం సుగమమైంది. ఇక కుర్రకారు అమితంగా ఇష్టపడే వై–ఫై సేవలందించే రూటర్ల ధరలు తగ్గే అవకాశాలుండడంతో ఆన్‌లైన్, ఇంటర్నెట్, సోషల్ మాధ్యమాలు వినియోగించేవారిలో జోష్ పెంచింది. మరోవైపు బ్రాండెడ్ దుస్తులు, కాస్మోటిక్స్ ధరలు పెరగడం మింగుడు పడని అంశం. చిన్న గృహాలకు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీలు ప్రకటించడం వేతనజీవులు, మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చే అంశం. – సాక్షి, సిటీబ్యూరో
► జైట్లీ బడ్జెట్ నగరవాసి ఆశలపై నీళ్లు
► కార్లు, బైక్‌లు, ఫోన్లు ప్రియం
► విందు వినోదం భారం
► దిగిరానున్న ఔషధ ధరలు