
ఒకేసారి మాఫీ చేయండి
పంట రుణాలపై సీఎంకు ఉత్తమ్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బుధవారం బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఒకేసారి రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ‘కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచింది. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వం రూ.3వేల కోట్లు అదనంగా పొందడానికి అవకాశం వ చ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరి మితి పెంచితే రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన హామీ నిలుపుకోవాలి. రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ బకాయిలు రూ.17వేల కోట్లు ఉండగా ఇప్పటివరకు రూ.4250 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలి న బకాయిలను వెం టనే విడుదల చేసి, రైతులను పంట రుణాల నుంచి విముక్తి చేయాలి. రాష్ట్రంలో తీవ్ర కరువు ఉంది. కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలోని 443 మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటే... కేవలం 231 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. అన్నింటినీ కరువు మండలాలుగా గుర్తించాలి’ అని ఉత్తమ్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.